టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదయ్యాయి. టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ఇస్తాంబుల్‌కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. టర్కీ పొరుగు దేశాలైన బల్గేరియా, గ్రీస్, రొమేనియాలలో కూడా ఈ ప్రకంపనలు కనిపించినట్టు టర్కీ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తాజా భూకంపంపై యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు.. ఇస్తాంబుల్ నగరానికి నైరుతి దిశగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో భూకమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం కేంద్రీకృతమైవుంది. భాకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇస్తాంబుల్ వాసులు భయంతో తమతమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. టర్కీతో పాటు పొరుగునవున్న బల్గేరియా, గ్రీస్, రొమేనియా దేశాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.
భూకంపం వల్ల జరిగిన ఆస్తి లేదా ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. సహాయక బృందాలు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో సంభవించిన పెను భూకంప విషాదం నుంచి టర్కీ పూర్తిగా తేరుకోలేదు. అపుడు 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశంలో పెను విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ మహా విపత్తులో టర్కాలో 53 వేల మందిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. సిరియా దేశంలో కూడా ఆరు వేల మంది చనిపోయారు. ఆస్తి నష్టం అపారంగా జరిగింది.