ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతామండలి ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో డాన్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా వుంది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు, ఉగ్రమూకల జాబితాను ఐరాస విడుదల చేసింది. ఇందులో దావూద్‌తో పాటు ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్, అల్ జవహరి పేర్లు కూడా వున్నాయి. ఇంకా ఈ జాబితాలో 139 పేర్లు పాకిస్థాన్‌కు చెందినవే కావడం గమనార్హం.
ఇందులో భాగంగా రావల్పిండి, కరాచీల నుంచి పలు పాకిస్థానీ పాస్ పోర్టులను దావూద్ పొందాడని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన నివేదికలో తెలిపింది. అలాగే కరాచీలోని నూరాబాద్ కొండ ప్రాంతంలో దావూద్‌కు ఓ విలాసవంతమైన భవనం వుందని పేర్కొంది.
ఇంకా ప్రపంచ దేశాల్లో అతనికి ఆస్తులు వున్నాయని వెల్లడించింది. భద్రతామండలి ఉగ్రసంస్థల జాబితాలో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, తాలిబాన్ పాకిస్థాన్ వంటి తదితర సంస్థలు చోటు దక్కించుకున్నాయి.