చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

ఠాగూర్

బుధవారం, 15 అక్టోబరు 2025 (17:42 IST)
చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అరుదైన ఖనిజాల విషయంలో చైనా పోకడ ఏమాత్రం బాగోలేదని తప్పుబట్టింది. చైనాలో దొరికే ఈ అరుదైన ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టిడి చేస్తోందని, తద్వారా ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయించేందుకు చైనా యత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ధోరణిని ఏమాత్రం సహించజాలమని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత్ సహాయం చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారంలో భారత్‌పై అమెరికా కన్నెర్రజేసింది. భారీగా సుంకాల భారం మోపింది. అయితే, చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సాయం చేయాలని కోరడం గమనార్హం.
 
ఇదే అంశంపై స్టాక్ బెసెంట్ మాట్లాడుతూ, ప్రపంచంలో మరెక్కడా లభించని అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఇటీవల నియంత్రణ విధించిందని చెప్పారు. విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే చైనా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలనే షరతు విధించిందన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది చైనాకు, ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ అని ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆయన మండిపడ్డారు. బీజింగ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే భారత్, అమెరికా కలిసి పని చేయాలని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు