కష్టాల్లో ఆప్ఘాన్ ప్రజలు - 3200 మందిని తరలించిన అమెరికా

బుధవారం, 18 ఆగస్టు 2021 (10:04 IST)
తాలిబన్ తీవ్రవాదుల కారణంగా ఆప్ఘన్ ప్రజలను అష్టకష్టాలు పడుతున్నారు. ఆప్ఘన్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశ ప్రజలు దేశాన్ని వీడి వెళ్లిపోయేందుకు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. చివరకు విమాన టైర్లు కూడా పట్టుకుని వేలాడుతూ వెళ్ళారు. ఇలాంటి వారంతా కిందపడి ప్రాణాలు కోల్పోయారు. అలా వేలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. 
 
ఇప్పటివరకు 3200 మందిని కాబూల్‌ నుంచి తరలించామని అమెరికా అధికార కేంద్రమైన వైట్‌హౌస్‌ ప్రకటించింది. అమెరికా రక్షణ విమాణాల ద్వారా ఇప్పటివరకు 3200 మందిని ఆఫ్ఘన్‌ నుంచి తరలించామని, అందులో 1100 మంది అమెరికా పౌరులు, యూస్‌లో శాశ్వత నివాసం కలిగినవారు ఉన్నారని తెలిపింది. 
 
మంగళవారం ఒక్కరోజే 1100 మందిని 13 విమానాల్లో అమెరికాకు తీసుకెళ్లామని పేర్కొన్నది. మిగిలిన 2 వేల మంది ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవారని, మరింత మంది ఆ దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది.
 
కాగా, ఆఫ్ఘన్‌ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారని అన్నారు. సోమవారం శ్వేతసౌధం నుంచి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. 
 
‘సొంత దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని నిలువరించడానికి ఆఫ్ఘన్‌ సైనికులు, ఆ ప్రభుత్వ నేతలే చిత్తశుద్ధితో పోరాడడం లేదు. అలాంటి యుద్ధంలో పోరాడడానికి ఇంకా ఎన్ని తరాలు అమెరికా సైనికులను పంపమంటారు?’ అని బైడెన్‌ ప్రశ్నించారు. తాలిబన్లకు భయపడి ప్రజలను విడిచిపెట్టి అధ్యక్షుడే పారిపోయారని చురకలు అంటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు