అణుకార్యక్రమం విషయంలో అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ప్రతిష్టంభన నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇకపై తాము సైనిక పరమైన చర్యలతో ముందుకు వెళ్లకుండా... ఆర్థిక కార్యక్రమాలతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకు దౌత్య మార్గమే సరైందని ట్రంప్ తెలిపారు.
అయినప్పటికీ అమెరికా- ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి మిసైల్ టెస్ట్ నిర్వహించి కయ్యానికి కాలుదువ్వాడు. అమెరికాతో తాము యుద్ధానికి సిద్ధం అని ప్రకటించిన కొద్ది గంటలకే ఉత్తర కొరయా అణురహిత మిస్సైల్‌ను ప్రయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన అగ్రరాజ్యం అమెరికా ఆదేశాలతో ఎయిర్ క్రాఫ్ట్‌లతో సిద్ధంగా ఉన్న యుద్ధనౌక ఉత‌్తర కొరియా వైపు దూసుకెళుతోంది.
ఉత్తర కొరియా మరోసారి మిసైల్‌ను పరీక్షించి చాలా పెద్ద తప్పు చేసిందని వైట్ హౌజ్ పేర్కొంది. శనివారం దక్షణ ప్యాంగ్యాంగ్ నుంచి మిసైల్‌ను ప్రయోగించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. జపాన్ సముద్ర తీరమే లక్ష్యంగా ఈ ప్రయోగం జరిగిందని చెప్పిన అమెరికా.. లక్ష్యాన్ని చేరకముందే పేలిపోయిందని పేర్కొంది. అయితే 44 మైళ్ల ఎత్తులో ఈ మిసైల్ ఎగిరిందని అమెరికా స్పష్టం చేసింది. అయితే తాము ప్రయోగించిన క్షిపణి విఫలమైనట్లు ఉత్తర కొరియా నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదు.