ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ టంప్ మరోమారు తన అక్కసును వెళ్లగక్కారు. తనకు తిక్కరేగిందంటే ఏం చేస్తానో తనకే తెలియదని అన్నారు. ఇరాన్ ఇప్పటికే హద్దులు మీరి ప్రవర్తించిందని, దానిపై తాము స్పందించడంలో జాప్యం జరిగిందన్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇరాన్‌పై లేదా ఆ దేశ అణు కేంద్రాలపై దాడులు చేసే ఆలోచన అమెరికాకు ఉందా అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ట్రంప్ నిరాకరించారు. అయితే, టెహ్రాన్ తన పరిమితులను అతిక్రమించిందని, దీనిపై చర్యలు తీసుకోవడం ఇప్పటికే ఆలస్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే వారంలో లేదా అంతకంటే ముందుగానే చాలా కీలకమైన పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
'వారం క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో నేను జోక్యం చేసుకుంటానో లేదో చెప్పలేను. నేను ఏం చేయబోతున్నానో ఎవరికీ తెలియదు' అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రతిపాదన చేసిందని చెబుతూనే, ఆ చర్చలు ఎప్పుడు, ఏ విధంగా జరుగుతాయనే వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం టెహ్రాన్ తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉందని, ఆ దేశం వద్ద సరైన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా లేవని ట్రంప్ వ్యాఖ్యానించారు.