నేడు అమెరికా ఎన్నికలు : మిస్టర్ ట్రంప్.. పెట్టెబేడా సర్దుకో.. జో బైడెన్
మంగళవారం, 3 నవంబరు 2020 (09:23 IST)
అమెరికా ఓటర్లు మంగళవారం కొత్త అధ్యక్షుడి కోసం మాత్రమేకాకుండా ప్రతినిధుల సభల సభ్యులను ఎన్నుకోవటానికి కూడా ఓటు వేస్తున్నారు. నాలుగేళ్ళకోసారి అధ్యక్ష ఎన్నికలతోపాటు 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు (హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్) కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి కూడా ఓటర్లు ప్రతినిధుల సభ సభ్యులను ఎన్నుకోనున్నారు.
అమెరికా చట్టసభల్లో అత్యంత కీలకమైన సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు కూడా మంగళవారం ఓటింగ్ జరుగుతున్నది. సెనేట్లో నాలుగేళ్ళకోసారి మూడోవంతు సీట్లు ఖాళీ అవుతాయి. వాటికి అధ్యక్ష ఎన్నికలతోపాటు ఓటింగ్ నిర్వహిస్తారు. వీటితోపాటు 11 రాష్ట్రాల గవర్నర్లను, రాష్ట్రాల చట్టసభల్లో ఖాళీ అయిన 86 స్థానాలకు సభ్యులను ఎన్నుకొనేందుకు కూడా అమెరికన్లు ఓటు వేయనున్నారు.
ఇదిలావుంటే, ఈ ఎన్నికల కోసం రికార్డు స్థాయిలో రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎన్నికల నిర్వహణతోపాటు అభ్యర్థులు, పార్టీల ప్రచార ఖర్చును కూడా కలుపుకుంటే 14 బిలియన్ డాలర్ల (రూ.104,237 కోట్లు) వ్యయం అవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి.
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికల ఓటింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. దీంతో ఈ పీఠం కోసం పోటీపడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి జో బైడెన్‌లు చివరి నిమిషంలో ప్రచారంలో ముమ్మరంగా నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, తన మద్దతుదారులను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగించారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పదన్నారు.
డొనాల్డ్ ట్రంప్ పాలనలో పడ్డ కష్టాలు ఇక చాలునని వ్యాఖ్యానించారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, తన బ్యాగులు సర్దుకుని, వైట్ హౌస్‌ను వీడి ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందంటూ జోస్యం చెప్పుకొచ్చారు.
ఓహియోలో తన చివరి ప్రచార దినాన్ని గడిపిన బైడెన్, ట్రంప్ పాలనలో కష్టాలు, ట్వీట్లు, కోపాలు, విద్వేషం, వైఫల్యం, బాధ్యతారాహిత్యం తదితర ఎన్నో కనిపించాయన్నారు. ఇకపై వాటిని దూరం చేసుకుని అభివృద్ధి దిశగా అమెరికా ముందుకు సాగాల్సివుందని అన్నారు.
తనను ఎన్నుకుంటే, కరోనా మహమ్మారిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని వస్తానని బైడెన్ మరోమారు హామీ ఇచ్చారు.