చైనాపై గుర్రుగా వున్న అమెరికా.. 1000 మంది విద్యార్థుల వీసాల రద్దు

గురువారం, 10 సెప్టెంబరు 2020 (15:47 IST)
కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాలకు అంటించిందని ఇప్పటికే చైనాపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా వుంది. ఈ నేపథ్యంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా చైనీయుల విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది. భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది.
 
మే నెలలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆధారంగా ఈ వీసాల రద్దు చేసినట్లు పేర్కొంది. చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వారు అమెరికాకు చెందిన సమాచారాన్ని తస్కరించకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్ ల్యాండ్‌ సెక్యూరిటీ చీఫ్‌ చాడ్‌ వోల్ఫ్‌ చెప్పారు. 
 
చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు, గూఢచర్యం పేరుతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్‌ పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని చాడ్‌ వోల్ఫ్‌ మరోసారి ఆరోపించారు.
 
హాంగ్‌కాంగ్‌లో చైనా ఆగడాలను ఆరికట్టే చర్యల్లో భాగంగా ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు వెలువరించిన ప్రకటన కింద ఈ వీసా రద్దు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 
 
ఇందులోభాగంగానే ఇప్పటివరకు వెయ్యికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేశామని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ప్రమాదం పొంచివున్న విద్యార్థుల సంఖ్య తక్కువేనని, ఇక్కడి చట్టాలకులోబడి వచ్చే విద్యార్థులు, పరిశోధకులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు