ఇంధన నిల్వలు లేక పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశాలు. ప్రభుత్వ ఉద్యోగులను తమ ఇళ్ల వద్ద నుంచే పనులు చేయాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన చేస్తున్నారు. మరోవైపు, ఆ దేశంలో విమానాశ్రయాలు కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి. దీనికి కారణం విదేశీ అప్పులను శ్రీలంక చెల్లించలేక పోవడమే. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఆ దేశానికి రుణం కింద ఇంధనం సరఫరా చేసేందుకు ఏ ఒక్క దేశమూ ముందుకురావడం లేదు.
ప్రస్తుతం ఉన్న ఇంధనాన్ని అత్యవసర సర్వీసుల వాహనాలకు మాత్రమే వాడుతున్నారు. పైగా, తాజాగా 40 వేల మెట్రిక్ టన్నుల ఇంధనానికి ఆర్డర్ ఇచ్చామని, అది శుక్రవారానికి చేరుకోవచ్చని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అంటే శుక్రవారం వరకు స్కూల్స్ మూతపడనున్నాయి. ఆ తర్వాత కూడా తెరుస్తారని గ్యారెంటీ లేదు. ప్రస్తుతం శ్రీలంకలో పెట్రోల్ ధర లీటరు రూ.470గాను, డీజిల్ ధర రూ.460గా పలుకుతోంది. అయినప్పటికీ వాహనదారులకు పెట్రోల్ లభించడం లేదు.