కరోనా వైరస్ పుట్టుకపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ, అనేక దేశాలు మాత్రం చైనాను ముద్దాయిగా చూస్తున్నాయి. ఈ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ ఆరోపణలను నిజం చేసే విధంగా తాజాగా ఓ నివేదిక బయటపడింది.
దీనికి సంబంధించిన కథనాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. అయితే గతంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఈ నివేదికను ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ల్యాబ్‌లో పనిచేసే సిబ్బంది హాస్పిటళ్లకు వెళ్లిన తీరు, వారికి ఉన్న అనారోగ్యం, కరోనా ఉదృతి పెరగడానికి ముందు అక్కడ జరిగిన పరిణామాలు అనేక అనుమానాలు దారి తీస్తున్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.
వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ వ్యాప్తి జరిగినట్లు మొదట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఓ సారి దర్యాప్తు చేపట్టింది. వుహాన్ నగరాన్ని విజిట్ చేసిన ఆ బృందం.. కరోనా వైరస్ సహజసిద్దంగానే జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు పేర్కొన్నది.