అణు చర్చల పునఃప్రారంభానికి ఉత్తర కొరియా ఆసక్తి!

బుధవారం, 3 ఆగస్టు 2011 (09:54 IST)
ఆరు దేశాలతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఉత్తర కొరియా సమ్మతం తెలుపుతోంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, చైనా, జపాన్, రష్యా, అమెరికా దేశాల మధ్య అణు చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను తయారు చేస్తోందంటూ దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి మిగిలిన దేశాలు వంతపాట పాడుతున్నాయి.

దీనిపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే, 2009 సంవత్సరంలో ఉత్తర కొరియా అణు చర్చల నుంచి తప్పుకుంది. దీంతో ఉత్తర కొరియాపై అనేక రకాల ఆర్థిక ఆంక్షలను అమెరికా విధించింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఇండోనేషియా రాజధాని బాలీలో ఉభయ కొరియా దేశాల మధ్య అణు చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య న్యూయార్క్‌లో ఇదే తరహా చర్చలు జరిగాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇందులో 2005లో కుదుర్చుకున్న "కొరియా ప్రాంతీయ అణ్వాయుధాలు నిరాయుధీకరణ ఒప్పందం"పై తిరిగి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి