అణు తీవ్రవాదానికి ఇరాన్ ఆశ్రయం కాగలదు

అణు తీవ్రవాదానికి ఇరాన్ గొడుగు పట్టే అవకాశం ఉందని ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు అభిప్రాయపడ్డారు. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటే అవి తీవ్రవాదుల్లోకి చేరే అవకాశం ఉన్నట్లు ఆయన అనుమానపడ్డారు. ప్రధాన ఉగ్రవాద సంస్థలు అణ్వాయుధాలను చేజిక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. నెతాన్యాహు మాట్లాడుతూ.. తీవ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు చేరితే జరిగే దారుణాలను ఊహించడం ఎవరి తరం కాదు. వాటితో వారు ఎటువంటి భీభత్సాన్నైనా సృష్టించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయేల్ ప్రధాని విమర్శలు గుప్పించారు.

ఇరాన్ అణ్వాయుధాలను సాధిస్తే, అవి తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీవ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇరాన్ అణు కార్యక్రమంపై చర్యలు తీసుకోకపోతే, ప్రధాన దేశాలు పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల ద్వారా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

ఇరాన్ అణ్వాయుధాలు సాధించుకుంటే, వాటిని ఆ దేశం తీవ్రవాదులకు ఇచ్చే అవకాశం ఉందని నెతాన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ అణు తీవ్రవాదానికి గొడుగుగా మారితే ప్రపంచానికి పీడకల మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రభుత్వం తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించినదని చెబుతున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి