ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ కమాండర్ హతం

ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రావీన్స్‌లో ఓ కీలక తాలిబాన్ కమాండర్‌ను తమ సిబ్బంది హతమార్చాయని పోలీసు యంత్రాంగం మంగళవారం వెల్లడించింది. తాలిబాన్ గ్రూపుకు చెందిన కీలక కమాండర్ ముల్లా రషీద్‌ను ఓ ఆపరేషన్‌లో పోలీసు సిబ్బంది హతమార్చారు. కుందుజ్ ప్రావీన్స్‌లోని తాలిబాన్ కమాండర్లలో రషీద్ ముఖ్యుడు.

పోలీసులు జరిపిన కాల్పుల్లో రషీద్ మృతి చెందినట్లు కుందుజ్ ప్రావీన్స్ ఐజీపీ అబ్దుల్ రజాక్ యాకుబీ తెలిపారు. మోటార్‌సైకిల్‌పై తన సహాయకుడితో వెళుతున్న రషీద్‌ను లక్ష్యంగా చేసుకొని పోలీసులు కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలోనే రషీద్ ప్రాణాలు కోల్పోయాడు. అతని సహాయకుడు మాత్రం తప్పించుకొని పరారయ్యాడు. రషీద్ మృతిని తాలిబాన్ గ్రూపు ధృవీకరించాల్సివుంది.

గత ఏడాది వరకు ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశం కుందుజ్ ప్రావీన్స్. అయితే గత కొన్ని నెలలుగా తాలిబాన్ గ్రూపు ఈ ప్రాంతంలోనూ అలజడి సృష్టిస్తోంది. ఇక్కడకు కూడా తాలిబాన్ కార్యకలాపాలు విస్తరించాయి. తాలిబాన్ల ప్రమేయంతో కుందుజ్ ప్రావీన్స్‌లోని గత కొన్ని నెలలుగా హింసాకాండ జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి