ఆఫ్ఘనిస్థాన్‌లో భారత్ ప్రాబల్యం పెరుగుతుండటం పాకిస్థాన్‌కు సహించకపోవచ్చని అమెరికా అభిప్రాయపడింది. ఆఫ్ఘన్లో భారత్ పాత్ర పెరగడం ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. భారత్ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు పాక్ చర్యలు చేపట్టిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
ఈ చర్యల ప్రభావం ఆఫ్ఘనిస్థాన్ లేదా భారత్‌లో ఉంటాయని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్న సంకీర్ణ దళాలకు నేతృత్వం వహిస్తున్న అమెరికా కమాండర్ జనరల్ స్టాన్లీ మెక్‌క్రిస్టల్ ఇటీవల అమెరికా రక్షణ శాఖకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో ఆఫ్ఘనిస్థాన్‌లో భారత్ పాత్ర పాకిస్థాన్‌ను రెచ్చగొట్టవచ్చని మెక్‌క్రిస్టల్ అభిప్రాయపడ్డారు.
అయితే ఇదే సమయంలో ఆఫ్ఘన్ పౌరులకు భారత్ కార్యకలాపాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెరుగుతోంది.
వీటిలో గణనీయమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాకుండా ఆఫ్ఘన్లో ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం భారత్‌కు అనుకూలంగా ఉంటుందని పాకిస్థాన్‌కు అర్థమయిందని ఈ అమెరికా కమాండర్ తన నివేదికలో వివరించారు. పాకిస్థాన్ తన పొరుగు దేశంలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చర్యలకు ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదన్నారు.