ఆరు దేశాల చర్చలకు ఉ కొరియా ససేమిరా

ఉత్తర కొరియా చేత అణ్వాయుధ కార్యక్రమానికి పూర్తిగా నిలిపివేయించేందుకు ఉద్దేశించిన ఆరు దేశాల చర్చలకు తాము తిరిగి వచ్చే ప్రసక్తి లేదని ఆ దేశ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అయితే తాము ఇప్పటికీ ఇతర మార్గాల్లో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సూచనప్రాయంగా తెలిపింది. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సోమవారం వార్తలు వెల్లడించింది.

ఆరు దేశాల చర్చలు వాస్తవానికి ఉద్రిక్తతలు తగ్గించలేవని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక, ఇతర మార్గాల్లో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అయితే చర్చలకు ఇతర మార్గాలేమిటో ఆయన వివరించలేదు. ఇదిలా ఉంటే ఐరాసలో ఉత్తర కొరియా దౌత్యాధికారిగా పనిచేస్తున్న సిన్ సోన్ హో గత వారం మాట్లాడుతూ.. తమ దేశం అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందన్నారు. అయితే ఆరు దేశాల చర్చలకు మాత్రం తాము రాబోమని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి