ఇరాన్ అణు వివాదాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించాలని అమెరికా, రష్యాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే ఇరాన్ స్పందించకుండా ఉంటే కొత్త ఆంక్షలను కూడా పరిశీలించాలని నిర్ణయించాయి. రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బరాక్ ఒబామాతో జరిగిన సమావేశంలో ఇరాన్ అణు వివాదంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపానని ద్మిత్రీ మెద్వెదెవ్ వివరించారు. ఇరాన్ అణు వివాదంపై అమెరికాకు తమ సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అణు శక్తిని ఇరాన్ శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ఓ వ్యవస్థను రూపొందించాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఆ దేశం చేతుల్లోకి అణ్వాయుధాలు చేరకుండా చూడాలనుకుంటున్నామన్నారు
ఆంక్షలు చాలా తక్కువ ఫలితాలు అందిస్తాయని, అయితే కొన్ని సమయాల్లో వాటిని తప్పించలేమని మెద్వెదెవ్ వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు వివాదానికి దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలకు కట్టుబడి ఉన్నామన్నారు.