ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం

పాకిస్థాన్ భద్రతా దళాలు స్వాత్ మరియు మాలాకంద్ డివిజన్‌లోని ఇతర ప్రాంతాల్లో జరిపిన శోధనల్లో తాలిబన్లకు చెందిన ఇద్దరు కమాండర్లతోపాటు 28 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

స్థానిక ఉగ్రవాద కమాండర్ ఉమర్ నవాబ్‌ను స్వాత్ లోయలోని చార్‌బాగ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాంబుదాడి రచయిత రజాఖాన్‌‌ను బునేర్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. వీరిని విచారించే నిమిత్తం రహస్య స్థావరాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆలమ్ గంజ్ ప్రాంతంలో ముగ్గురు, పినిదార్ బాందాలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా పలాయీ క్షేత్రంలో 15 మంది ఉగ్రవాదులు, చార్‌బాగ్‌లో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

అలాగే బార్‌షౌర్, రునియాల్, దాగాయీ, సిరసానాయీతోపాటు స్వాత్‌లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 16 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు భద్రతాదళాలు పేర్కొన్నాయి. గత మే నెల నుంచి ఇప్పటి వరకు తాము దాదాపు రెండు వేలమంది ఉగ్రవాదులను హతమార్చామని, వీరితోపాటు తమ భద్రతా దళాలకు చెందిన మూడు వందల మంది మృతి చెందారని పాక్ సైనికాధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి