ఎయిర్ ఫ్రాన్స్ విమాన బ్లాక్ బాక్స్ గుర్తింపు

బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ను గుర్తించినట్లు మంగళవారం ఓ వార్తాపత్రిక కథనం వెల్లడించింది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ జెట్ విమాన బ్లాక్ బాక్స్‌ను గుర్తించారని ఫ్రాన్స్‌కు చెందిన లె మండే వార్తాపత్రిక వెబ్‌సైట్‌లో తెలిపింది.

విమానం బ్లాక్ బాక్సును గుర్తించేందుకు చిన్న జలాంతర్గామిని పంపారని, అది అట్లాంటిక్ మహాసముద్రం అడుగున ఓ ప్రదేశం నుంచి బలహీనమైన సంకేతాలు అందుకుందని ఈ వార్తాపత్రిక పేర్కొంది. పరిశోధకులు ఈ సంకేతాలు కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ 447 విమాన బ్లాక్ బాక్స్‌కు చెందినవై ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నారు.

అయితే ఈ సంకేతాలు విమానంలోని డేటా రికార్డర్, వాయిస్ రికార్డర్లలలో దేని నుంచి వచ్చిందో నిర్ధారించలేదు. పరిశోధకులు అట్లాంటిక్ అడుగున సంకేతాలు అందుకున్నారని ఫ్రాన్స్ అధికారిక వర్గాలు తెలిపాయి. విమానం కూలిపోయిన తరువాత పరిశోధకులకు ఇటువంటి సంకేతాలు అందుకోవడం ఇదే తొలిసారి.

ఈ సంకేతాలను విశ్లేషించేందుకు తమ వద్ద ఉన్న అన్ని పరికారాలను ఉపయోగిస్తున్నామని, వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని తాను ధృవీకరించలేనని చెప్పారు. విమానం బ్లాక్ బాక్స్ దొరికితే, అది కూలిపోవడానికి సంబంధించి కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి