గునియాలో అధికారంలో ఉన్న జుంతాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనలను అదుపు చేసేందుకు గునియా భద్రతా దళాలు ప్రతిపక్ష నిరసనకారులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 87 మంది పౌరులు మృతి చెందారు. హింసాకాండ వాస్తవ రూపాన్ని కప్పిపుచ్చేందుకు భద్రతా యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సోమవారం కోనాక్రై నగరంలోని ఓ స్టేడియంలో ప్రతిపక్ష ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని మిలిటరీ ముట్టడించింది. ఆందోళనకారులపైకి భద్రత దళాలు జరిపిన కాల్పుల్లో 87 మంది మృతి చెందారని పోలీసు వర్గాలు చెప్పాయి. అయితే సమోరీ టౌరీ మిలిటరీ క్యాంపులో 47 మంది మృతదేహాలు ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించాయి.