పోర్చుగల్ ఎన్నికల్లో సోషలిస్ట్‌ల విజయం

పోర్చుగల్ ప్రధానమంత్రి జోస్ సోక్రట్స్ వరుసగా రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సోక్రట్స్ నేతృత్వంలోని సోషలిస్ట్‌లు సోమవారం తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే వారికి ప్రస్తుతం ఉన్న స్థాయిలో మెజారిటీ రాలేదు. పార్లమెంట్‌లో సరైన మెజారిటీ లేకపోవడంతో.. వారి ప్రభుత్వ స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తం 230 సీట్లు ఉన్న పోర్చుగల్ అసెంబ్లీలో సోషలిస్ట్ పార్టీ 96 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2005లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 121 స్థానాలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం సోషల్ డెమొక్రటిక్ పార్టీ (పీఎస్‌డీ)కి తాజా ఎన్నికల్లో 78 సీట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో సోషలిస్ట్‌లు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అసాధారణ విజయం సాధించారని సోక్రట్స్ (52) తెలిపారు.

వెబ్దునియా పై చదవండి