ప్రభాకరన్ తల్లిదండ్రులను వేధించడం లేదు: లంక

శ్రీలంక యుద్ధంలో మృతి చెందిన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ చీఫ్ ప్రభాకరన్‌కు సంబంధించిన బంధువులను, అతని తల్లిదండ్రులను తామేమీ వేధింపులకు గురి చేయడం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంకలోని శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రభాకరన్ తల్లిదండ్రులు, బంధువులు, ఇతర ఎల్టీటీఈ నేతలను తాము వేధించడం లేదని ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స వెల్లడించారు.

శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స మాట్లాడుతూ.. ప్రభాకరన్ తల్లిదండ్రులు, మాజీ ఎల్టీటీఈ నేత తమిళ్‌సెల్వన్ భార్య, ఇతర ఎల్టీటీఈ అగ్రనేతల దగ్గరి బంధువులు శరణార్థ శిబిరాల్లో ఉన్నారు. వారిపట్ల తామేమీ అమానుషంగా ప్రవర్తించడం లేదని, తమ సైన్యం వారికి సాయం చేస్తోందని రాజపక్స తెలిపారు.

వన్నీ శరణార్థ శిబిరంలో ఉంటున్న ప్రభాకరన్ తల్లిదండ్రులపట్ల శ్రీలంక ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు వచ్చిన కథనాలను రాజపక్స ఈ సందర్భంగా తోసిపుచ్చారు. వీరితోపాటు అంతర్యుద్ధం కారణంగా క్యాంపుల్లో తలదాచుకుంటున్న మూడు లక్షల మంది పౌరులతో శ్రీలంక ప్రభుత్వం స్నేహపూరితంగా మెలుగుతోందన్నారు.

వెబ్దునియా పై చదవండి