బ్రౌన్‌తో సమావేశానికి నిరాకరించిన ఒబామా

బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్‌తో సమావేశమయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరాకరించినట్లు తెలుస్తోంది. తనతో ద్వైపాక్షిక సమావేశానికి ఒబామా నిరాకరించినట్లు వచ్చిన కథనాలు గోర్డాన్ బ్రౌన్‌ను ఇరుకునపెడుతున్నాయి. బరాక్ ఒబామాతో ద్వైపాక్షిక సమావేశానికి బ్రిటన్ ఐదుసార్లు చేసిన విజ్ఞప్తులను ఒబామా తోసిపుచ్చినట్లు గురువారం కథనాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ కథనాలను తోసిపుచ్చింది. రెండు దశాబ్దాల క్రితం విమానాన్ని కూల్చివేసి, అనేక మంది అమెరికన్ల మరణానికి కారణమైన లాకర్‌బీ విమానం పేల్చివేత కేసు దోషిని ఇటీవల బ్రిటన్ యంత్రాంగం విడిచిపెట్టడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. బ్రౌన్‌తో సమావేశానికి ఒబామా నిరాకరించినట్లు వచ్చిన వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఐక్యరాజ్యసమితి సదస్సు, పీట్స్‌బర్గ్‌లో జరిగే జి- 20 సమావేశంలో పాల్గొనేందుకు గోర్డాన్ బ్రౌన్ అమెరికా వచ్చారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో ఇరుదేశాల అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా బరాక్ ఒబామా చైనా అధ్యక్షుడు హు జింటావో, రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్, జపాన్ కొత్త ప్రధానమంత్రి యుకియో హతోయామాలతో సమావేశమవడం, అదే సమయంలో బ్రౌన్‌తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.

అయితే బ్రౌన్, ఒబామాలు అధికారికంగా సమావేశం కానప్పటికీ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఇద్దరి మధ్య 15 నిమిషాలు సంభాషణలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా కథనాలను బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇవి నిరాధారమైన కథనాలని పేర్కొంది.

ఇరుదేశాల నేతలు తాజా పర్యటన సందర్భంగా పలుమార్లు సమావేశమయ్యారని తెలిపింది. వాతావరణ మార్పులతోపాటు, పాకిస్థాన్, తీవ్రవాదంపై పోరు అంశాలపై కూడా ఇరుదేశాల నేతలు చర్చలు జరిపారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. అంతేకాకుండా పీట్స్‌బర్గ్‌లో జి- 20 సదస్సులోనూ బ్రౌన్, ఒబామా చర్చలు కొనసాగిస్తారని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి