వారిద్దరి మధ్య ఒప్పందం కట్టుకథే: పాకిస్థాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ల మధ్య ఒప్పందం కుదిరినట్టు వచ్చిన వార్తలు కేవలం కట్టుకథేనని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ముషారఫ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, అందువల్ల ఆయన ఉనికిని కాపాడుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బాబార్ అభిప్రాయపడ్డారు.

బెనజీర్ ప్రాణాలతో ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ముఫారఫ్ మాటలు ఆయన దురాలోచనకు ప్రతీకగా ఫర్హతుల్లా అభివర్ణించారు. ఇటీవల సీఎన్ఎన్-ఐపీఎన్ ఛానల్‌కు ముషారఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో బెనజీర్ తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్టయితే, తిరిగి అధ్యక్ష పదవిలో తాను కొనసాగేలా తమ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పిన విషయం తెల్సిందే.

దీనిపై పాక్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రపంచంలో నియంతలకు భవిష్యత్‌లో ఎదురయ్యే కష్టాల నుంచి గట్టెక్కేందుకు వారు పలు రకాల కట్టుకథలు అల్లుతారని, ఆ కోవలోనే ముషారఫ్ కూడా ప్రజల మద్దతు పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫర్హతుల్లా బాబర్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి