హార్పూన్ క్షిపణిని ఆధునీకరించలేదు: పాకిస్థాన్

అమెరికా సరఫరా చేసిన హార్పూన్ క్షిపణులను తాము ఆధునీకరించలేదని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా అందజేసిన హార్పూన్ నౌకా విధ్వంసక క్షిపణులను భూభాగంపై లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా పాకిస్థాన్ ఆధునీకరించిందని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్థాన్ ఖండించింది.

అయితే హార్పూన్ క్షిపణులను తాము ఆధునీకరించలేదని, ఎప్పటికీ అది జరగదని పాక్ నేవీ చీఫ్ అడ్మిరల్ నౌమన్ బషీర్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం హార్పూన్ క్షిపణుల విషయంలో తమను నిరాధారమైన కథనాల కారణంగా అపార్థం చేసుకుందని పేర్కొన్నారు. దీనికి తాము సరైన స్థాయిలో వివరణ ఇస్తున్నామని బషీర్ విలేకరులతో చెప్పారు.

భారత్‌తో ఆయుధ పోటీ కోసం పాకిస్థాన్ యంత్రాంగం హార్పూన్ క్షిపణులను, పి-3సి విమానాలను ఆధునీకరించి, భూభాగంపై లక్ష్యాలను ఛేదించే విధంగా మార్పులు చేసిందని అమెరికా అధికారులు చెప్పినట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాదనను పాక్ నేవీ చీఫ్ తోసిపుచ్చారు. తాము ఆ పని చేయలేదన్నారు.

వెబ్దునియా పై చదవండి