నా పాలసీ మార్చుకోను : స్నేహా ఉల్లాల్

గురువారం, 7 ఆగస్టు 2008 (14:49 IST)
WD
చూడ్డానికి అచ్చు రేణుదేశాయ్.. ఐశ్వర్యారాయ్ ఉన్నట్లు అనిపించే బాలీవుడ్ నటి స్నేహా ఉల్లాల్. తాజాగా, "ఉల్లాసంగా.. ఉత్సాహంగా..." చిత్రంలో నటించినా అంతకుముందు మంచు మనోజ్‌కుమార్ హీరోగా నటిస్తోన్న "నేను మీకు తెలుసా?" అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌లో విడుదల కానుందని స్నేహ ఉల్లాల్ చెబుతోంది. మొదటి సినిమాగా విడుదలైన "ఉల్లాసంగా ఉత్సాహంగా" చిత్రం చక్కటి హిట్‌తో తనకు మంచి ఆరంభాన్నిచ్చిందని అంటోంది. ఈ నేపథ్యంలో ఆమెతో కాసేపు...

ప్రశ్న... మీ నేపథ్యం గురించి చెప్పండి?
జ... నాన్న నితిన్ గారిది మంగలూరు. సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ ఉష గృహిణి. వృత్తిరీత్యా మస్కట్‌లో కొనాళ్ళు ఉన్నాం. నేను పుట్టి పెరిగింది మస్కట్‌లోనే. సింధీ మాతృభాష. చదివింది ట్వల్త్ స్టాండెడ్. నాకు పంజాబీ, ఇంగ్లీషు, హిందీ భాషలొచ్చు. పంజాబీ, హిందీలో "ప" లాంగ్వేజ్‌తో మాట్లాడే భాషకు కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాను.

ప్రశ్న... సినిమా రంగంలో ఎలా ప్రవేశించారు?
జ... ముంబైలో ఎం.ఎం.కె. కాలేజీలో చదివేటప్పుడు ఓసారి క్యాంటిన్‌లో స్నేహితులతో కలిసి బర్గర్ తింటున్నాను. అక్కడే అర్పిత పరిచయమైంది. ఆమె సల్మాన్ ఖాన్ సోదరి అని తర్వాత తెలిసింది. స్నేహితురాలైన అర్పిత తర్వాత నా గురించి సల్మాన్‌కు చెప్పింది. మరోవైపు అమ్మ క్యాన్సర్‌ చికిత్స కోసం ఆసుపత్రిలో ఉంది. ఓ రోజు ఇంటికి రాగానే ఫోన్ మోగింది. నేను "సల్మాన్ ఖాన్‌ను స్నేహ ఉల్లాల్‌తో మాట్లాడవచ్చా" అన్నారు. ఎవరో ఆటపట్టిస్తున్నారనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు ఫోన్ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. అమ్మ ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక మాటల మధ్యలో ఈ విషయం చెప్పాను. ఆమె ఇన్‌కమింగ్‌కాల్‌లో నెంబర్ తీసుకుని చేసింది. సల్మాన్ ఖాన్ మాట్లాడారు. అలా అమ్మ, నాన్న అంగీకారంతో 2003లో "లక్కీ" అనే చిత్రంలో నటించాను. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది.

ప్రశ్న.. తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఏది బాగుంది?
జ... నిజం చెప్పాలంటే.. ఇక్కడే చాలా బాగుంది. నేను ఎవరితోనూ మాట్లాడలేకపోయినా... నెర్వస్‌గా ఉందనుకుంటారు. బాలీవుడ్‌లో అలాకాదు. ఈమెకు ఈగో... అంటూ రకరకాలుగా మాట్లాడుతారు. అక్కడ చాలా రూడ్‌గా ఉంటారు. మన టాలెంట్ ఏమిటో అక్కడ నిరూపించుకుంటేనే అందరూ కలిసిపోతారు. లేదంటే ఎవరూ పట్టించుకోరు.

ప్రశ్న... మీలో రేణుదేశాయ్, ఐశ్వర్య పోలికలున్నాయనిపిస్తుంది? దీన్నెలా తీసుకుంటారు?
జ... నాను నేనుగా ఉండాలనే ఇష్టపడతాను. నాలో వేరేవారు కన్పిస్తున్నారంటే... ఆ ముద్ర నాపై పడుతుంది. ఇది ఒక రకంగా మైనస్, ప్లస్‌గా ఉపయోగపడుతుంది. సో... ఇవేవి నేను పట్టించుకోను. స్నేహా ఉల్లాల్‌గా ఉండటమే ఇష్టం.

ప్రశ్న... ఇంకా తెలుగులో ఏవైనా సినిమాల్లో నటిస్తున్నారా?
జ... రెండు చిత్రాల్లో అడుగుతున్నారు. ఇంతవరకు ఓకే కాలేదు. హిందీలో అశోక్ త్యాగి దర్శకత్వంలో "ఆర్యన్" సినిమాలో నటిస్తున్నా. ఇదే కాకుండా హాలీవుడ్‌లో టామ్‌జార్జ్ దర్శకత్వంలో రూపొందుతోన్న "గాంధీపార్క్"లో నటిస్తున్నా. షూటింగ్ కూడా మొదలైంది. ఏడాదిలోనే సినిమా విడుదలవుతుంది.

ప్రశ్న.. మీకిష్టమైన డ్రెస్..?
జ... జీన్స్

ప్రశ్న... ఇష్టమైన ఫుడ్..?
జ... పుల్కా, బిర్యానీ... ఇవన్నీ ఇంటిలో చేసినవంటేనే ఇష్టం.

WD
ప్రశ్న... వంటలో ప్రావీణ్యం ఉందా?
జ... చికెన్, మటన్ చేయడం బాగా నేర్చుకున్నా.

ప్రశ్న... అంటే మీరు పక్కా మాంసాహారులా?
జ... ఒకప్పుడు... గత రెండేళ్ళలో నాలో తెలీకుండా మార్పు వచ్చింది. శాఖాహారమే తింటున్నాను.

ప్రశ్న... దీనికేమైనా కారణముందా?
జ... ఓసారి కారులో ప్రయాణిస్తుంటే.. కొంతమంది గుంపులుగా ఉన్న మేకల్ని పట్టుకోవడం చూశాను. ఎందుకంటే.. బలికోసమని చెప్పారు. దాంతో తెలీని మార్పు కల్గింది. దానికి నోరులేదు... చంపొద్దు అని అరవలేదు. ఇది తప్పని తెలిసింది. సహజంగా నాకు కుక్కలు, పిల్లులంటే చాలా ఇష్టం. వాటికి ఏ మాత్రం అనారోగ్యం కల్గినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళతాను.

ప్రశ్న... అంటే ఇక్కడ అమలగారు చేస్తున్న తరహాలోనా?
జ... అవునండి... మొట్టమొదటిగా హైదరాబాద్ వచ్చినప్పుడు అమల-నాగార్జునను కలిశాను. చాలా విషయాలను షేర్ చేసుకున్నాం. ఆమె భావాలు చాలా నచ్చాయి.

ప్రశ్న... అమలగారులా మీరు కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయవచ్చుకదా?
జ... చేయాలనే ఉంది.. చెప్పాలంటే.. నాకొక పేరు, హోదా ఉంటేనే వింటారు. అందుకోసం డబ్బు సంపాదించాలి. ఆ తర్వాతే నేను చెప్పింది ఎవరైనా వింటారు. అందుకే అన్నీ సమకూరాక జంతువుల కోసం ఆసుపత్రి నిర్మించాలనుంది. మనుషుల్ని ఎలా అభిమానిస్తానో మూగజీవాలకు కూడా అలానే ప్రేమను పంచుతాను. మానవత్వమే జీవితం. అందరినీ ప్రేమించడమే పరమార్థం. దేవుడి దృష్టిలో అంతా సమానమే.

ప్రశ్న... మీలో బుద్ధిస్ట్ ఆలోచనులున్నట్లు తెలుస్తున్నాయి.?
జ... అటువంటివి ఏమీలేవు... అందరు దేవుళ్ళు సమానమే.

ప్రశ్న... పెళ్ళిపై మీ అభిప్రాయం?
జ... పెళ్ళి అనేది పవిత్రమైంది. నాకింకా ఆ వయస్సు రాలేదు. ఇంకా పదేళ్ల తర్వాతే ఆలోచిస్తా.

ప్రశ్న... ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారు.?
జ.. పెళ్ళి అనేది మన సంస్కృతి. దానికి గౌరవం ఇవ్వాలి. అలాంటి వ్యక్తినే చేసుకుంటా. ముఖ్యంగా అమ్మా, నాన్నలను గౌరవంగా చూడాలి. నా ఆలోచనలకు తగ్గట్లు వ్యవహరించాలి. ప్రధానంగా జంతుప్రేమ కలిగినవాడై ఉండాలి. నేను చేసినట్లే మూగజీవులకు సేవచేసిన వాడైతేనే చేసుకుంటా.

ప్రశ్న... ఎక్స్‌పోజింగ్ చేయమంటే ఏం చేస్తారు..?
జ.. నేను చేయను. ఎక్స్‌పోజింగ్ అనేది అన్నీ చోట్లా ఉంది. ఉల్లాసంగా..లో కరుణాకరన్ చాలా ప్లసెంట్‌గా చూపించారు. అలాగే మంచు మనోజ్ చిత్రంలోనూ డీసెంట్‌గా చేశాను. ఈ తరహాలోనే మెయింటెయిన్ చేస్తాను. డబ్బుకోసమో, కెరీర్ కోసమో నా పాలసీ మార్చుకోను. దక్షిణాది వారు కేవలం ఎక్స్‌పోజింగ్ చూపిస్తేనే చూస్తారని ఏ మాత్రం అనుకోను.