ముందు కోర్టుకి వెళ్లి ఆ తర్వాత అల్లు అర్జున్‌తో చేస్తా: మాళవిక శర్మ ఇంటర్వ్యూ
బుధవారం, 6 జనవరి 2021 (22:38 IST)
తన కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ చేస్తూ 2017లో బ్లూ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది మాళవిక శర్మ. హిమాలయ, సంతూర్ వంటి పలు టీవీ వాణిజ్య ప్రకటనలు చేసింది. 2018లో రవితేజ సరసన `నేల టిక్కెట్` సినిమాలో నటించింది. ఆ తర్వాత కెరీర్ పరంగా ఎత్తుపల్లాలు చూసినా... అసలు కెరీర్ లాయర్ అవ్వాలనే కోరిక బలంగా వుంది. తన తాతగారు ప్రముఖ క్రిమినల్ లాయర్. తాతగారు చనిపోయాక కోరిక బలంగా మారింది. అందుకు ఆమె తండ్రి కూడా ప్రోత్సహించారు. అందుకే ఎల్.ఎల్.బి. పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఎల్‌ఎల్ఎంకు సిద్ధమవుతోంది.
మరోవైపు వచ్చిన సినిమా అవకాశాల్ని చేసుకుంటూపోతుంది. తనకు రెండూ రెండు కళ్ళులాంటివనీ.. లాయర్‌గా వుండాలంటే తప్పకుండా క్రిమినల్ లాయర్‌ను అవుతానని తేల్చిచెబుతోంది. రామ్‌తో `రెడ్` సినిమాలో నటించిన ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ సారాంశం.
రవితేజ, రామ్.. ఇద్దరూ ఎనర్జీ హీరోలే.. మీరు వారి నుంచి ఏమి గ్రహించారు?
ఇద్దరూ వేరు వేరు నైజం. రవితేజగారు చాలా సరదాగా వుంటారు. రామ్ అయితే సెట్‌లో సైలెంట్‌గా వుంటారు. షాట్ రెడీ అనగానే.. యాక్టింగ్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా వుండేవారు. అందుకేనా ఎనర్జిటిక్ స్టార్ అన్నారు అనిపించేది.
రెడ్‌లో మీ పాత్ర ఎలా వుంటుంది?
నా పాత్ర పేరు మహిమ. నా రియల్‌లైఫ్‌కు కాస్త భిన్నంగా వుంటుంది. ఈ పాత్ర నాకు వ్యక్తిగతంగా పరిణిత చెందిన నటిగా గుర్తింపు వస్తుందని నమ్ముతున్నా.
దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం ఎలా అనిపించింది?
తను సెట్‌లో చాలా కూల్‌గా వుంటారు. రెండు, మూడు టేక్ లయినా విసుక్కోరు. నటినుంచి ఏం కావాలో ఆయనకు తెలుసు. షూటింగ్లో నా పాత్ర పేరు మహిమతోనే పిలిచేవారు. దానితో పాత్రలో లీనమయినట్లుగా అనిపించేది.
లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ చేశారు? ఎలా ఫీలయ్యారు?
ఇటలీ వెళ్ళాం. ఇండియా నుంచి విమానంలో వెళ్ళేటప్పుడు మాస్క్‌లు వేసుకుని, శానిటైజర్లు పెట్టుకుని ఎక్కాం. అక్కడ వెళ్ళాక కేసులు పెరిగాయి. దాంతో ఎక్కవున్నా కరోనా వస్తుందని ధైర్యం చేసి మాస్క్ వేసుకోవడం మానేశా. దేవుడి దయ వల్ల మాకు ఇబ్బంది కలగలేదు.
నటనలో శిక్షణ తీసుకున్నారా?
ముంబైలో కొన్ని వర్క్‌షాప్‌లో పాల్గొన్నాను. అక్కడే పాత్ర ఎలా వుంటుంది. దాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నా. యాడ్ ఫిలింస్ చేసేటప్పుడు చాలా మంది పరిచయం అయ్యారు. అక్కడ వారిని కూడా గమనిస్తుండేదాన్ని.
తెలుగులో ఎవరితోనైనా నటించాలనుందా?
నాకు ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో నటించాలనుంది.
ఒకవేళ అల్లు అర్జున్‌తో నటించే అవకాశం వచ్చిన రోజే న్యాయవాదిగా వాదించాల్సి వస్తే ముందు కోర్టుకు వెళ్ళి న్యాయ వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తా. ఆ తర్వాతే నటిస్తాను. ఇందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా.. నాంపల్లి కోర్టుకు వెళ్ళి అక్కడ పట్టాభిగారిని కలిసి మెళుకువలు నేర్చకుంటా. ఈ నెల 8,9 తేదీల్లో కూడా నాంపల్లి వెళుతున్నా.
న్యాయవాది అవ్వాలని ఎలా కలిగింది?
మా తాత గారు క్రిమినల్ లాయర్. ఆయన చనిపోయాక నాకూ లాయర్ కావాలనుండేది. నువ్వు లాయర్ కావాలంటే నీ డబ్బుతోనే చదువుకోవాలని మా నాన్నగారు చెప్పారు. దాంతో కాల్ సెంటర్‌లో కూడా పనిచేసి డబ్బు సంపాదించా. ఆ తర్వాత కొన్ని యాడ్స్‌లో చేశాను. ఇటీవలే ఎల్.ఎల్.బి. పూర్తిచేశా. ఎల్.ఎల్.ఎం. కూడా పూర్తి చేస్తా. లాయర్‌గా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నా. కచ్చితంగా మంచి క్రిమినల్ లాయర్ అవుతా.
రామ్‌తో డాన్స్ వేసేటప్పుడు కష్టమనిపించలేదా?
రామ్ చాలా వేగంగా డాన్స్ చేస్తాడు. విషయం ఏమంటే.. ఆయనతో మెలోడి సాంగ్ మాత్రమే చేశా. నాకు కూచిపూడి, కథక్ నాట్యంలో ప్రవేశం వుంది.
ఇంకా తెలుగు నేర్చుకోలేదా?
నేల టిక్కెట్.. సినిమా టైంలో అస్సలు తెలుగు తెలీదు. ఆ తర్వాత ముంబైలో తెలుగు ట్యూటర్‌ను పెట్టుకున్నా. డైలాగ్ చెప్పడంలో లిప్ సింక్ తేడా రాకూడదని చాలా ప్రయత్నాలు చేస్తున్నా. త్వరలో తెలుగులో మాట్లాడే స్థాయికి చేరుతా.
కొత్త సినిమాకు సైన్ చేశారా?
ప్రస్తుతం తమిళ సినిమా ఒకటి చేస్తున్నా. ఇంకా కొన్ని కథలు విన్నా. ఫైనల్ చేయలేదు.