''సీనియర్ నిర్మాతగా 32 ఏళ్ళపాటు నిర్మాతగా వున్నాను. కొన్ని సినిమాలకు ప్రొడక్షన్ చూసుకున్నాను. ఈ ఏడాది నవంబర్ 8న మా సినిమా సెన్సార్ అయింది. తిరిగి రాత్రి ఇంటికివచ్చాక.. నోట్ల రద్దు అని వినగానే.. ఆశ్చర్యపోయాను. చేసేదిలేదు. అప్పటికే 11న రిలీజ్ అనుకున్నాం. కానీ డిసెంబర్ 30 వరకు ఆగాల్సి వచ్చింది. ఈ 50 రోజులపాటు దాదాపు అదనంగా 30 లక్షలకు పైగా నష్టపోయా.. వాటిని పూడ్చాలంటే కష్టమే. కొంత వడ్డీ రూపేణా కొంత పబ్లిసిటీ రూపేణా ఖర్చు నాకు తగ్గేది. మొత్తమ్మీద మోదీ గారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా పడిందని సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తెలిపారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.
పెద్ద హీరోలతో చేసి చిన్న సినిమా చేయడానికి కారణం?
ఛత్రపతి, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి అగ్ర హీరోలతో సినిమా చేసినా ఎప్పటినుంచో చిన్న సినిమా చేయాలనే కోరిక వుంది. అది 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'తో పూర్తయింది.
నరేష్‌ను ఎంపిక చేయడానికి కారణం?
దర్శకుడు నాగేశ్వరరెడ్డితో ఎప్పట్నుంచో సినిమా చెయ్యాలనుకున్నాను. అంతకుముందు ఏవోవే కథలు చెప్పారు. కానీ ఇటీవల అందరికి సేఫ్ సినిమాగా దెయ్యం కాన్సెప్ట్ వుండడంతో 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' కథ చెప్పారు. వినగానే మరో ఆలోచన లేకుండా నరేష్ అయితే కరెక్ట్‌గా సరిపోతాడని ఎంపిక చేశాం.
షూటింగ్‌లోనే 'కొడతామ్..హిట్..' అంటూ అన్నారని నరేష్ చెప్పారు?
అవును. ఈ సినిమాపై నమ్మకం పెరిగింది. హార్రర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రంలో బాగా కుదిరాయి. అలాగే సెంటిమెంట్ కూడా అందర్నీ ఆట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. ఇవన్నీ చిత్ర విజయానికి కారణమవుతాయని తెలిసిపోయింది.
పాటలకు బాగా ఖర్చు పెట్టారు?
ఐదు పాటలున్నాయి. బ్యాంకాక్‌లో తీశాం. అసలు బ్యాంకాక్‌లోనే ఖర్చు తక్కువ అవుతుంది. ఊటీలో తీస్తే ఎక్కువ ఖర్చు. అందుకే అందరూ విదేశాలకు వెళుతుంటారు. అక్కడ ఖర్చులు తక్కువ. రాయితీలు ఇస్తారు. మనదగ్గర ఖర్చులు పెరుగుతాయి. ఈ సినిమాకు బ్యాంకాక్‌లో చేయాలని రాజుసుందరంతో పాటలు తీశాం. హైదరాబాద్‌లో సెట్ వేసి రెండు పాటలు దినేష్, గణేష్ మాస్టర్ నేతృత్వంలో తీశాం.
ఈ ఏడాది రెండు సినిమాలు ఇస్తున్నారు?
అవును. ఏడాది ఆరంభంలో సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో' సెంటిమెంట్ సినిమా ఇచ్చాను. ఈ ఏడాది చివర్లో ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఇవ్వబోతున్నాను.
నాగేశ్వరరెడ్డి పనితీరు ఎలా వుంది?
తను ఎప్పుడే పెద్ద దర్శకుడు జాబితాలోకి వెళ్ళాల్సింది. అంత తెలివి వుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవిధంగా రూపొందించారు. 'దేనికైనా రెడీ', 'ఈడోరకం ఆడోరకం' వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో డెఫినెట్‌గా నాగేశ్వరరెడ్డి పెద్ద రేంజ్‌కి వెళ్ళే డైరెక్టర్ అవుతాడు.
అనుకున్న బడ్జెట్‌తో తీయగలిగారా?
ఎప్పుడూ అనుకున్నది జరగదు. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా కూడా సినిమాని సినిమాలాగే తీశాం. వేస్టేజ్ లేకుండా బడ్జెట్ కంట్రోల్ చేస్తూ సినిమా తీస్తే ఎలాంటి ప్రాబ్లెమ్ వుండదు.
నిర్మాతగా మీ ప్రమేయం ఎంత మేరకు వుంటుంది?
ముప్పైరెండేళ్ళుగా కాంబినేషన్‌లు చేసి వారికి తగ్గట్లుగా కథ రెడీ చేసుకుని సినిమాలు తీశాను. ఇప్పుడు అలాగే చేస్తున్నాను. నేను తీసిన అన్నీ సినిమాలకి డైరెక్టర్‌ని ఫాలో అవుతూ ఒక కో-డైరెక్టర్‌లా, ప్రొడక్షన్ కంట్రోలర్‌లా ఇన్‌వాల్వ్ అయి సినిమాని ఇష్టపడి తీస్తాను. సినిమాల మీద పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చాను. ఆ పిచ్చిలో పడి కొట్టుకుపోతున్నాను. సినిమాని ఎంజాయ్ చేస్తూ పరిగెడుతున్నాను. ఇలా ఎంతకాలం వెళ్తానో చూడాలి. సినిమా తప్ప నాకు ఏ వ్యాపారం తెలీదు. ఇక్కడ నిర్మాత ఎంతకాలం వుంటాడో చెప్పలేం. అలాంటిది నేను ఇంతకాలం ఇండస్ట్రీలో వుంటూ మంచి సినిమాలు తీసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
నాన్నకు ప్రేమతో టైంలో పవన్‌కళ్యాణ్ ఇష్యూ ఇబ్బంది అనిపించలేదా?
అది అవగాహన లోపంతో జరిగింది. అలా జరగాల్సింది కాదు. తర్వాత మా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అత్తారింటికి దారేది చిత్రంలో తనకు కొంత రెమ్యునరేషన్ రావాల్సి వుందని అన్నాడు. అది కొంత అజాగ్రత్త వల్ల ఆలస్యమైంది. తర్వాత క్లియర్ అయింది. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే.
మళ్ళీ అగ్రహీరోలతో సినిమాలు ఎప్పుడు?
ఏదీ ప్లాన్ చేసుకోలేదు. వచ్చే ఏడాది అంతా అగ్రహీరోలు డేట్స్ ఖాళీలేవు. 2018కి అగ్రహీరోలతో ప్లాన్ చేస్తున్నాను. ఇటీవలే శర్వానంద్‌తో తీస్తున్న సినిమా పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. కొంత ప్యాచ్‌వర్క్ బేలెన్స్ వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 2017లో రెండు, మూడు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.