చనిపోయిన వ్యక్తిని విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆవిష్కరించడమే 'నాగభరణం' : కోడి రామకృష్ణ

సోమవారం, 10 అక్టోబరు 2016 (08:43 IST)
విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలైన ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ వంటి సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేసిన నాగరహవు అనే సినిమాను రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌ గాడా, సాజిద్‌ ఖురేషి, సొహైల్‌ అన్సారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాపై మ‌ల్కాపురం శివ‌కుమార్ తెలుగులో 'నాగాభరణం' పేరుతో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. 14న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కోడి రామకృష్ణతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. 
 
* చాలాకాలం తర్వాత వస్తున్నారు?
నా సినిమాలన్నింటికీ విడుదలప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే 'నాగభరణం' విషయంలో నేను ఈ స్థాయి క్రేజ్ అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. తెలుగులో కూడా విజువల్ ఎఫెక్ట్స్‌లో సాహసం అంటూ క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ దృష్ట్యానే సుమారు 600 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఇదంతా చూస్తూంటే చాలా సంతోషంగా ఉంది. 
 
* కన్నడ సినిమా తెలుగులో డబ్... ఎలా ఉంది?
తెలుగులో చేసిన చాలా సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతూ ఉండేవి. ఈసారి కన్నడలో చేసిన ఓ సినిమా తెలుగులో వస్తోంది. ఇది కన్నడ సినిమా అయినా నిర్మాతలు తెలుగు వర్షన్‌కు మొదటి నుంచి మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి మించి తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్న శివకుమార్ ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. స్ట్రైట్ తెలుగు సినిమాలా నాగభరణం విడుదలవుతుందంటే ఇక్కడి 
డిస్ట్రిబ్యూటర్స్ ఎఫర్ట్స్ వల్లే. 
 
* చనిపోయిన వ్యక్తిని విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆవిష్కరించడం ఎలా అనిపించింది?
అదొక అద్భుతమైన సాహసం. రమ్య ప్రధాన పాత్రలో నడిచే ఈ సినిమాలో చివరి 15 నిమిషాల్లో ఒక బలమైన పాత్ర కథను మలుపు తిప్పుతుంది. ఆ పాత్రకు దివంగత సూపర్ స్టార్ విష్ణు వర్ధన్‌ను పెడదాం అని నిర్మాతలు అన్నప్పుడు ఆశ్చర్యపోయా. ఆ తర్వాత మకుట విజువల్ ఎఫెక్ట్స్ దీన్ని నిజం చేస్తుందని తెలుసుకొని ఆ దిశగా అడుగులేశాం. 
 
* విష్ణు వర్ధన్ పాత్ర ఎంత సేపు ఉంటుంది?
15 నిమిషాల పాటు విష్ణువర్ధన్ పాత్ర ఉంటుంది. చనిపోయిన ఆయనను అలా మళ్ళీ ఆవిష్కరించడం అన్నది ఇండియన్ సినిమాలో ఒక అతిపెద్ద ప్రయోగం. విజువల్స్ చూశాక, విష్ణు వర్ధన్ భార్య ఏడ్చేశారు. ఆయనను మళ్ళీ ఇలా సినిమాలో ఆవిష్కరించారా? అంటూ ఆవిడ కన్నీళ్ళు పెట్టినప్పుడు మా ప్రయోగం మరింత సంతృప్తినిచ్చింది. 
 
* ట్రెండ్‌ను ఫాలో అవుతుంటా..?
ప్రతి సినిమాను నేను చూస్తుంటాను. టెక్నికల్‌గా ఏదైనా కొత్త విషయం ఉన్న సినిమాలను చూసినప్పుడు నేను ఆ టెక్నాలజీని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాను. నేను `అమ్మోరు` సినిమాలో తొలిసారి గ్రాఫిక్స్‌ వాడినప్పుడు అందరూ థ్రిల్‌ ఫీలయ్యారు. నేను ఏదో గ్రాఫిక్స్‌ వాడాలని కాకుండా గ్రాఫిక్స్‌, కథలోని నెటివిటీకి కనెక్ట్‌ అయ్యేలా ఉందా అని చూసి దానికి తగిన విధంగా గ్రాఫిక్స్‌ చేస్తాను. అలాగే `దేవి` సినిమా, `దేవుళ్లు` సినిమా ఇలా ఏ సినిమా చేసినా అప్పటి ట్రెండ్‌ను బట్టే చేస్తాను. అయితే గ్రాఫిక్స్‌తో సినిమా చేయడమనేది టైం టేకింగ్‌ ప్రాసెస్‌. దాని గురించి దర్శక నిర్మాతలకే కాదు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా అవగాహన కలిగించాలి. `అంజి` సినిమా గ్రాఫిక్స్‌ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి వంటి ఇమేజ్‌ ఉన్న వ్యక్తితో సినిమా చేస్తున్నప్పుడు గ్రాఫిక్స్‌ ఆ ఇమేజ్‌ను ఈక్వల్‌ చేసేలా ఉండాలి. అందుకు టైం తీసుకుంటుంది. ఈ విషయాన్ని సినిమా స్టార్టింగ్‌లోనే చిరంజీవికి చెప్పాను. ఆయన నేను కొత్త హీరోలా చేస్తానండి.. ఏం ఫర్వాలేదు అన్నారు. అన్నమాట ప్రకారమే ఆయన ఎన్నో రోజులు కాల్షీట్స్‌ కేటాయించి `అంజి` కోసం వర్క్‌ చేశారు. 
 
* గ్రాఫిక్స్‌తో తెలుగులో ఒక కొత్త పంథా సృష్టించారు కదా?
నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ‘అమ్మోరు’ సినిమాతో గ్రాఫిక్స్‌ను తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచే గ్రాఫిక్స్‌తో ప్రయాణం చేస్తూనే వస్తున్నా. కొత్తగా టెక్నాలజీలో ఏ మార్పులొచ్చినా వెంటనే వాటి గురించి తెలుసుకుంటూ ఉంటా. అంజి, అరుంధతి ఇలాంటి సినిమాలతో శ్యామ్‌తో కలిసి గ్రాఫిక్స్‌ను కొత్తగా పరిచయం చేశాం. ఇప్పుడు నాగభరణంతో మళ్ళీ కొత్త ప్రయాణం. ఇవన్నీ తెరపైకి వస్తున్నాయంటే డెడికేషన్ ఉన్న నిర్మాతల వల్లే. ఏ దర్శకుడైనా నిర్మాతలను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ విషయాలను ఆలోచించాలి. 
 
* సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? 
నిజానికి మేము ఈ స్థాయి క్రేజ్ ఉంటుందని ఊహించలేదు కాబట్టి, కాస్త టెన్షన్ అయితే ఉంది. అయితే మంచి ఔట్‌పుట్‌తో సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నాం. దీంతో తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. 
 
* పుట్టపర్తి సాయిబాబా సినిమా ఎంతవరకు వచ్చింది? 
నాగభరణం విడుదల కాగానే పుట్టపర్తి సాయిబాబా సినిమా మళ్ళీ మొదలవుతుంది. ఆ సినిమా ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రధాన భాషలన్నింటిలో విడుదలవుతుంది. 

వెబ్దునియా పై చదవండి