చదవకే ఇక్కడున్నా... నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ని : నారా రోహిత్
గురువారం, 20 అక్టోబరు 2016 (22:16 IST)
నారా రోహిత్ 'బాణం' తర్వాత అంతగా హిట్ వచ్చిన సినిమా లేదు. అయినా సినిమాలు వరుసగా చేస్తూనే వున్నాడు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో నిలదొక్కుకోకుండా.. అసలు జయాపజయాలతో సంబంధం లేకుండా గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం చిత్రమే. నారారోహిత్‌కు ఆ అవకాశం దక్కింది. దానికి ఆయనకు ఎవరో ఫండింగ్ ఇస్తున్నారనే కామెంట్లు విన్పిస్తున్నాయి. అలాగే సోలో హీరోగా సక్సెస్ చూసి చాలా కాలమైన ఆయనకు నాగశౌర్యతో 'జ్యో అత్యుతానంద'లో నటించి విజయాన్ని సాధించారు.
ఇదిలావుండగా తాజా 'శంకర' అనే సినిమాతో శుక్రవారమే థియేటర్‌కు వస్తున్నారు. రెజీనా నాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లీలా మూవీస్ పతాకంపై జె.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్‌తో కలిసి ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) నిర్మించారు. ఎం.వి.రావు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
ఈ సినిమా రెండేళ్ళు పైగా పట్టిందే?
అవును. అప్పట్లో వున్న నిర్మాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో మరో నిర్మాతకు ఆగాల్సి వచ్చింది.
చాలా కాలంనాటి కథ ఇప్పటి తరానికి కనెక్ట అవుతుందనుకుంటున్నారా?
తమిళంలో ఈ సినిమా 2011లో విడుదలైంది. బాలీవుడ్‌లో ఇటీవలే 'అకీరా'గా విడుదల చేశారు. అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాబట్టి మూడు భాషల్లో వచ్చింది. కథ అనుకున్నప్పుడు బాడీ కాస్త తగ్గినట్లుంటుంది, ఇప్పుడు కొంచెం లావుగా వుంటుంది అంతే''
ఏదైనా సామాజిక అంశాన్ని తీసుకున్నారా?
లేదు. ఓ కాలేజీ కథ.
కథేమిటి?
ఒక కాలేజీ అబ్బాయి తనకు సంబంధంలేని విషయంలో ఇరుక్కుంటాడు. అప్పుడు పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరం. స్టూడెంట్‌కి, పోలీసుకు మధ్య జరిగే వార్ ఈ సినిమా.
తమిళ చిత్రానికి దీనికి మార్పులు చేశారా?
తమిళంలో 40 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని మేం నాలుగు నిమిషాల పాటలో పెట్టేశాం. అలాగే చాలా మార్పులు నేటివిటీ పరంగా చేశాం. తమిళంలో హీరోయిజం తక్కువగా ఉంటుంది. మిగిలిన పాత్రలు కూడా లీడ్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ కమర్షియల్‌గా ఉండాలని హీరోయిజాన్ని పెంచారు.
కాలేజీ కథ అంటున్నారు. మీరు చదివిన రోజులు గుర్తుకువచ్చాయా?
కాలేజీ సీన్స్ చేసేటప్పుడు నేను చదివిన కాలేజీ రోజులు గుర్తుకువచ్చాయి. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ను. కానీ అక్కడ కూర్చుంటే ఎక్కువ ప్రశ్నలడుగుతారని ముందుకు మారేవాడ్ని.
బాగా చదివేవారా?
బాగా చదివితే ఈపాటికి ఏదో శాస్త్రవేత్త అయ్యేవాడిని. ఇలా హీరో అయ్యేవాడ్ని మాత్రం కాదు.
ఏ హీరోకు లేని వెసులుబాటు మీకున్నట్లుంది.. హిట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నారు.. ఫండింగ్ ఎక్కడినుంచో వస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి.
(నవ్వుతూ) అలా ఇచ్చేది ఎవరో చెబితే నేను కూడా వెళ్లి కలుస్తా. నేను సిగ్గరిని. ఎవరి వద్దకు వెళ్లి సినిమాలు తీయమని అడగలేను. నా దగ్గరకు వచ్చిన కథల్లో మంచి వాటిని ఎంపిక చేసుకుని చేసుకుంటూ పోతా.
వరుస చిత్రాల వల్ల ఇబ్బంది అనిపించలేదా?
లేకేం.. వరసగా చిత్రాలు చేస్తూ ఒక ఆడియో చేశాక మరో సినిమా వార్త రావడంతో.. అసలు నేను ఏ సినిమా చేస్తున్నాను.. అనే కన్‌ఫ్యూజ్ చాలామందిలో వుంది. ప్రేక్షకులు కూడా కన్‌ప్యూజ్ అయ్యారు. అందుకే ఒక సినిమా విడుదలయ్యాక... గ్యాప్ తీసుకుని మరో సినిమా ప్రమోషన్ వచ్చేలా చూసుకుంటున్నాను.
కొత్త సినిమాలు ఎంతవరు వచ్చాయి?
అప్పట్లో ఒకడుండేవాడు.. సినిమా పూర్తయింది. కథలో రాజకుమారి సినిమా చిత్రీకరణలో వుంది. ఇది కాకుండా బెక్కం వేణుగోపాల్ సంస్థలో ఓ సినిమా.. మరో రెండు కమర్షియల్ చిత్రాలు చేస్తున్నా.
బాహుబలిలో చేస్తున్నారా? గడ్డెం పెంచారు?
అంత అదృష్టమా... కొద్దిరోజుల షూటింగ్ గ్యాప్ అందుకే పెంచాను.
పెళ్లి ఆలోచన వుందా?
ఇంకా టైమ్ వుంది. పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది.