ఐపీఎల్-10: బెంగళూరుకు మరో దెబ్బ.. డివిలియర్స్‌కు వెన్నునొప్పి.. డౌటేనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ పదో సీజన్ నుంచి స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపీఎల్‌‍లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటికే కోహ్లీ దూరమైన నేపథ్యంలోఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఐపీఎల్‌లో బెంగుళూరుకు చెందిన ఏబీ డివిలియర్స్‌ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 
దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో భాగంగా జరుగుతున్న మూమెంటమ్‌ వన్డే కప్‌లో ఏబీ డివిలియర్స్ ఆడాల్సి ఉంది. కానీ వెన్నునొప్పి కారణంగా డివిలియర్స్‌ వన్డే కప్‌కి దూరమైనట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. డివిలియర్స్‌కి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో.. ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
నిజానికి సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్కులో జరిగే మూమెంటమ్‌ వన్డే కప్‌లో టైటాన్స్‌తో జరిగే ఫైనల్స్‌లో ఏబీ డివిలియర్స్ ఆడాల్సి ఉంది. ఐతే ఉన్నట్టుండి వెన్నునొప్పితో ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో డివిలియర్స్‌ ఐపీఎల్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది.

వెబ్దునియా పై చదవండి