బంతికి, బ్యాట్‌కు మధ్య జరిగిన మహా పోటీలో గెలిచిన బంతి: సన్‌రైజర్స్‌కు చిరస్మరణీయ విజయం

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (02:25 IST)
ఐపీఎల్-10 సీజన్లో జరిగిన అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మర్చిపోలేని విజయాన్ని చెమటోడ్చి సాధించింది. ఒంటిచేత్తో విజయాన్ని లాక్కోవాలని చూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ మనన్ వోహ్రా అసాధారణ బ్యాటింగ్ ఒకే ఒక్క బంతితో భువనేశ్వర్‌ముందు తలవంచిన క్షణంలో విజయం సన్ రైజర్స్‌నే అలంకరించింది. చివరి 6 ఓవర్లు ప్రేక్షకులకు పూర్తి మజా.. ముంగాళ్ల మీద లేని నిలబడిన ప్రేక్షకులు, మైదానంలో ఉత్కంఠకే ఉత్కంఠను నేర్పిన క్షణాలు.. విజయం ఖాయమైన పరిస్థితుల్లో వోహ్రా బ్యాటింగ్ మెరుపులు సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఆశలను తుంచివేస్తున్న కీలకక్షణంలో భువనేశ్వర్ సంధించిన బంతి వికెట్లను గిరాటేయడమే కాదు. విజయాన్ని సన్ రైజర్స్ చేతుల్లో పెట్టింది.
 
హైదరాబాద్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ మనన్‌ వోహ్రా (50 బంతుల్లో 95; 9 ఫోర్లు, 5 సిక్సర్లు)  చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆ జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. సహచరుల అండ లేకపోయినా అంతా తానే అయి జట్టును విజయానికి చేరువగా తెచ్చినా... వోహ్రా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. విజయానికి 6 ఓవర్లలో పంజాబ్‌ చేయాల్సిన పరుగులు 76... ఈ దశలో హైదరాబాద్‌ గెలుపు దాదాపు ఖాయమైంది. కానీ క్రీజ్‌లో ఉన్న మనన్‌ వోహ్రా మరోలా ఆలోచించాడు. మెరుపు బ్యాటింగ్‌తో ఒక్కసారిగా సీన్‌ మార్చేశాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు రాబట్టాడు. చివర్లో 10 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో భువనేశ్వర్‌ అద్భుత బంతితో వోహ్రాను అవుట్‌ చేసి పంజాబ్‌ ఆశలను కూల్చాడు. భువీ బౌలింగ్‌తో ఊపిరి పీల్చుకున్న హైదరాబాద్‌ చివరకు ఐదు పరుగులతో గట్టెక్కింది.
 
సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 పరుగుల  తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్నర్‌ (54 బంతుల్లో 70 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత అర్ధసెంచరీ సాధించగా, నమన్‌ ఓజా (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం పంజాబ్‌ 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మనన్‌ మినహా అంతా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువనేశ్వర్‌ కుమార్‌ సన్‌రైజర్స్‌  విజయంలో కీలక పాత్ర పోషించాడు.
 
ఛేదనలో తొలి బంతికే భువనేశ్వర్, ఆమ్లా (0)ను అవుట్‌ చేసి పంజాబ్‌కు షాక్‌ ఇచ్చాడు. భువీ తన తర్వాతి ఓవర్లో ప్రధాన బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ (10)ను కూడా అవుట్‌ చేసి రైజర్స్‌ జట్టులో ఉత్సాహం పెంచాడు. అయితే మరో ఎండ్‌లో వోహ్రా దూకుడు ప్రదర్శించాడు. రషీద్‌ తొలి ఓవర్లో అతను రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. వీరిద్దరు మూడో వికెట్‌కు 32 బంతుల్లో 41 పరుగులు జోడించిన దశలో అప్ఘాన్‌ ద్వయం కింగ్స్‌ను దెబ్బ తీసింది. ముందుగా మోర్గాన్‌ (13)ను నబీ బౌల్డ్‌ చేయగా...తర్వాతి ఓవర్లోనే మిల్లర్‌ (1), సాహా (0)ల స్టంప్స్‌ను రషీద్‌ పడగొట్టాడు. అక్షర్‌ (7) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కానీ చివర్లో వోహ్రా అదరగొట్టే బ్యాటింగ్‌ పంజాబ్‌ జట్టులో ఆశలు రేపినా... ఓటమి మాత్రం తప్పలేదు.
 

వెబ్దునియా పై చదవండి