'బాగా ఫేమస్ అవ్వాలి మామా... నాకు బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా' అంటూ తన అక్కను హత్య చేసేందుకు ముందు రోజు ఓ యువకుడు చేసిన రీల్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పొద్దస్తమానం తన ప్రియుడుతో ఫోనులో మాట్లాడుతుందన్న కోపంతో ఓ యువకుడు తన అక్కను గొంతుకు వైరు బిగించి హత్య చేసిన విషయం తెల్సిందే. రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంలో ఈ హత్య జరిగింది.
ఈ గ్రామానికి చెందిన రుచిత (21) అనే యువతి తన ప్రియుడుతో ఫోనులో మాట్లాడటంపై ఆగ్రహించిన తమ్ముడు రోహిత (20) గొడపడ్డాడు. అయినా ఆమె మాట వినక పోవడంతో తన అక్క వల్ల గ్రామంలో కుటుంబ పరువు పోతోందని ఆగ్రహించి రోహిత్ వైరుతో రుచిత గొంతు బిగించి హత్య చేశాడు. హత్యకు ముందు రోజు రోహిత్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ రీల్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
'బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా' అంటూ రోహిత్ రీల్ చేశాడు. దీంతో అక్క వల్ల కుటుంబ పరువు పోతుందనే కారణంతో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసమే అక్కను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రోహిత్ పథకం ప్రకారమే రుచితను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.