వరుస ఓటములతో ఒత్తిడిలో కోహ్లీ.. అంపైర్‌‍తోనే గొడవకు దిగేశాడు.. కానీ ఫలితం సున్నా

సోమవారం, 24 ఏప్రియల్ 2017 (05:01 IST)
ఆసీస్‌తో టెస్టు మ్యాచ్‌ల నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో అసహనం పెరుగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే మ్యాచ్ అంపైర్లతో గొడవకు దిగే స్థాయికి వెళ్లింది. మిస్టర్ కూల్ ధోనీతో ఏడేళ్లకు పైగా ఆడుతున్నప్పటికీ కోహ్లీ అతడినుంచి మిన్నువిరిగి మీద పడినా సంయమనం ఎలా పాటించాలో నేర్చుకోలేక పోయాడనిపిస్తుంది. తాజాగా కొల్‌కతాలో ఆదివారం రాత్రి మైదానంలో ఫీల్డ్ అంపైర్‌తోనే గొడవకు దిగిన కోహ్లీ చివరకు మళ్లీ మ్యాచ్ కోల్పోయి కన్నీరు పెట్టాడు.
 
మైదానంలోని ఫీల్డ్ అంపైర్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి గొడవకి దిగాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గంభీర్ ఔట్ నిర్ణయాన్ని వెల్లడించడంలో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీ తడబడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కోహ్లి మైదానంలోని ఇద్దరి అంపైర్లతో వాదనకు దిగాడు. మధ్యలోనే క్రిస్‌గేల్ వచ్చి కోహ్లిని వారించే ప్రయత్నం చేశాడు. 
 
ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన మిల్స్ బౌలింగ్‌లో బంతిని స్లిప్‌వైపు తరలించేందుకు గంభీర్ ప్రయత్నించాడు. కానీ అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి బ్యాట్‌ని తాకకుండా గంభీర్ చేతి గ్లౌవ్స్‌ని తాకుతూ వెళ్లి కీపర్ కేదార్ జాదవ్ చేతుల్లో పడింది. దీంతో బెంగళూరు టీమ్ వికెట్ పడిన ఆనందంలో సంబరాలు చేసుకోసాగింది.
 
కానీ  అంపైర్ క్రిస్ మాత్రం ఔట్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ మరో ఫీల్డ్ అంపైర్ నందన్‌తో చర్చించి తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌‌కి నివేదించాడు. ఔట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. ముందుగానే ఎందుకు నిర్ణయం ప్రకటించలేదు అంటూ కోహ్లి అంపైర్ నందన్‌తో వాదనకు దిగాడు. బంతి ఎలా వెళ్లిందో అతనికి చూపిస్తూ మైదానంలోనే అసహనం ప్రదర్శించాడు. ఈ సమయంలోనే కోహ్లి తీరును గమనిస్తూ నిల్చొన్న గంభీర్ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. 
 
గత ఐపీఎల్ సీజన్లలో గంభీర్, విరాట్ కోహ్లి మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఇద్దరూ మైదానంలోనే కొట్టుకునేంతలా ప్రవర్తించారు. మళ్లీ తాజా గొడవతో కోహ్లీపై క్రమశిక్షణ చర్యలు తప్పదని తేలుతోంది. 
 
కోహ్లీ తన కోపాన్ని అంపైర్లపై కాకుండా ఆటపై దృష్టి సారిస్తే బాగుంటుందేమో..

వెబ్దునియా పై చదవండి