ధోని... ధోనీ... ఇంతకీ ధోనీ కట్టప్పా...? బాహుబలా...?

మహేంద్ర సింగ్ ధోనీ గురించి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 10 క్రీడలో జట్టును ఫైనల్ వరకూ తెచ్చిన ధోనీ అక్కడికి వచ్చేసరికి తేడా కొట్టి ఒకే ఒక్క పరుగు తేడాతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ కప్పును ఇచ్చేశారు. ఇప్పుడు దీనిపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతమైన చర్చ జరుగుతోంది. 
 
రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు ధోనీ కట్టప్పలా మారిపోయి వెన్నుపోటు పొడిచారని కొంతమంది అంటుంటే... మరికొందరు ధోనీ బాహుబలి అంటూ కొనియాడుతున్నారు. ఎవరి వాదన కరెక్టో కానీ ఐపీఎల్ సీజన్ ఆటలో మాత్రం ధోనిని దురదృష్టం వెన్నాడుతోందని చెప్పక తప్పదు. గత మ్యాచ్‌ల ఫలితాలను చూసినప్పుడు ఇది నిజమేనేమోననిపిస్తుంది.
 
కొద్దిగా లోపలికి తొంగిచూస్తే... ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచుల్లో నాలుగుసార్లు ​ముంబై ఇండియన్స్‌ను ధోనీ ఎదుర్కున్నాడు. ఐతే ఈ నాలుగుసార్లలో ఒక్కసారి విజయం సాధించగా మూడుసార్లు ఆయన జట్టు ఓటమి పాలైంది. అంతేకాదు... అత్యధిక ఐపీఎల్‌  ఫైనల్‌ మ్యాచులు... పదింటికి ఏడు మ్యాచులను ఆడిన తొలి ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు కూడా. తాజాగా రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టును మొదట్నుంచి ఫైనల్ వరకూ లాక్కొచ్చి ఫైనల్ దశలో మరోసారి అపజయం మూటగట్టుకున్నారు. ముంబై ఇండియన్స్ కప్ ఎగరేసుకెళ్లింది. ఈ నేపధ్యంలో ధోనీ కట్టప్ప అని కొందరూ, కాదుకాదు బాహుబలి అని మరికొందరు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి