ఐపీఎల్ 2018 టోర్నీలోభాగంగా, శుక్రవారం రాత్రి కోల్‌కతా వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్థానిక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది. ఒత్తిడిని జయించలేక చతికిలపడింది. అదేసమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్ రషీద్ ఖాన్ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఫలితంగా సన్‌రైజర్స్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈనెల 27వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది.
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. సాహు (27 బంతుల్లో 5 ఫోర్లతో 35), ధవన్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) తొలుత రాణించగా, మ్యాచ్ చివర్లో రషీద్ ఖాన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 నాటౌట్‌గా నిలవడమే కాకుండా, బంతితో కూడా రాణించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి ఆబద్బాంధవుడిగా మారాడు.
ఆ తర్వాత 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. ఫైనల్లో చోటే లక్ష్యంగా ఛేదన కోసం బరిలోకి దిగిన కోల్‌కతాకు అదిరే ఆరంభం లభించింది. కానీ, ఈ ఊపును చివరి వరకు కొనసాగించలేకపోయింది. తొలి 13 ఓవర్ల వరకు బాగానే ఆడినట్టు కనిపించినా ఆ తర్వాతే గతి తప్పింది. రషీద్ ఖాన్ స్పిన్ మాయకు షకీబ్, బ్రాత్‌వైట్ మెరుగైన బౌలింగ్ తోడవడంతో కోల్‌కతా దెబ్బతింది.
అంతకుముందు భువనేశ్వర్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ వరుసగా 4,6,4,4తో చెలరేగి 19 పరుగులు రాబట్టాడు. అయితే ఆ వెంటనే సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో అతడు అవుటైనా కోల్‌కతా 20 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. దీనికితోడు ఒత్తిడిని కోల్‌కతా ఆటగాళ్లు జయించలేక పోయారు. ఫలితంగా ఆ జట్టు ఓటమి చవిచూసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రషీద్ ఖాన్‌కు దక్కింది.