ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ బౌలింగ్ ధాటికి హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. ఐపీఎల్ ట్వంటీ-20లో భాగంగా లీగ్ దశలో భాగంగా 30వ పోటీ ఆదివారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి పృథ్వీ షా నాలుగు పరుగులకే అవుట్ కావడం షాక్ నిచ్చింది.
కానీ బ్యాటింగ్‌కు దిగి శ్రేయాస్ ఐయ్యర్ (45), కెలిన్ (40) నిలకడగా ఆడటంతో 20 ఓవర్లలో ఢిల్లీ ఏడు వికెట్ల పతనానికి 155 పరుగులు సాధించింది. తదనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు.
వార్నర్ 51 పరుగులు, పోర్స్డో 41 పరుగులు సాధించారు. కానీ తర్వాత బరిలోకి దిగిన బ్యాట్స్‌మెన్లు వరుసగా స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్లు ఆడినా ఢిల్లీ బౌలింగ్ ధాటికి కేవలం 19 పరుగులు మాత్రమే సాధించగలిగారు. దీంతో హైదరాబాద్ జట్టు 116 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఢిల్లీ 39 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.