మ్యాచ్ ముగింపులో పరమ చెత్తగా ఆడుతున్నాం.. ఇక ఏం మాట్లాడను : డేవిడ్ వార్నర్
సోమవారం, 19 అక్టోబరు 2020 (10:00 IST)
ఐపీఎల్ జట్లలో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విదేశీ ఆటగాడైన డేవిడ్ వార్నర్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఈ జట్టు సూపర్‌గా ఆడుతోంది. ముఖ్యంగా, మ్యాచ్ ఆరంభంలో దూకుడుగా ఆడుతోంది. కానీ, మ్యాచ్ ముగింపుకు వచ్చే సమయానికి పరమ చెత్తగా ఆడుతోంది. ఫలితంగా చేజేతులా ఓడిపోతోంది. ఆదివారం కోల్‌కతా నైట్ రౌడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది.
ఆదివారం అబుదాబి వేదికగా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో సన్ రైజర్స్ ఓడిపోయింది. సూపర్ ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమిపై హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. మొదట మ్యాచ్‌ను బాగానే ప్రారంభించినప్పటికీ ముగింపులో మాత్రం తమ జట్టు విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు తనకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని తెలిపాడు.
తాము చివరి మూడు మ్యాచ్‌లలో విజయం అంచుల దాకా వచ్చి, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో చతికిలపడుతున్నట్టు చెప్పారు. అంటే చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంటున్నామన్నారు. ఆదివారం మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని తాను అనుకుంటున్నానని తెలిపాడు.
దుబాయ్‌తో పోల్చితే అబుదాబి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైందప్పటికీ, ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో బ్యాటింగ్‌కు ఇబ్బందికరంగా మారిందని తెలిపాడు. విలియమ్సన్ గాయంతో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడని, ఇది అతని అంకితభావానికి నిదర్శనమన్నాడు. అయినప్పటికీ మ్యాచ్ చివర్లో తమ ఆటగాళ్లు పట్టు సడలించడంతో పాటు.. సూపర్ ఓవర్‌లో పూర్తిగా విఫలం కావడంతో ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు.
చేజేతులా ఓడిన హైదరాబాద్ జట్టు
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేజేతులా ఓడింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హోరాహోరీగా పోరాడినప్పటికీ... సూపర్ ఓవర్‌లో మాత్రం దారుణంగా ఆడి చేజేతులా ఓడింది. సూపర్ ఓవ లో కేవలం 2 పరుగులు చేసి తన ఓటమికి తానే కారణమైంది.
సూపర్ ఓవర్‌లో సన్ రైజర్స్ తరపున వార్నర్, బెయిర్ స్టో బరిలో దిగారు. అయితే కోల్‌కతా బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వార్నర్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సమద్ కూడా బౌల్డ్ కావడంతో 2 పరుగులే వచ్చాయి.
ఇక కోల్‌కతా తరపున దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ సూపర్ ఓవర్ ఆడారు. సన్ రైజర్స్ తరపున రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా కోల్‌కతా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. ఐదు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు 16 ఓవర్ల వరకు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఈ కారణంగా 4 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత పట్టు సడలించారు. ఫలితంగా కేకేఆర్ ఆటగాళ్లు చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు పిండుకున్నరు. దీంతో 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్ మెన్ విలువైన పరుగులు జోడించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
మ్యాచ్ ఆఖర్లులో ఆ జట్టు మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో చకచకా 29 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతగా ఆడి 34 రన్స్ నమోదు చేశాడు.
అంతకుముందు ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 36, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాటి 23 పరుగులు చేయగా, నితీశ్ రానా 29 పరుగులు జోడించాడు. ఆండ్రీ రస్సెల్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు.
కేకేఆర్ ఆటగాళ్లలో ఓపెనర్లు గిల్ 36, త్రిపాఠి 23, రానా 29, రస్సెల్ 9, మోర్గాన్ 34, కార్తీక్ 29 చొప్పున పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, బాసిల్ థంపి, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు... 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.
చివరి ఓవర్ లో 18 పరుగులు కావాల్సి ఉండగా, వార్నర్ 3 ఫోర్లు బాది సన్ రైజర్స్‌ను రేసులోకి తీసుకువచ్చినా, చివరి బంతికి తడబడడంతో ఒక పరుగే వచ్చింది. దాంతో మ్యాచ్ టై అయింది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 47 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 28 బంతుల్లో 7ఫోర్లతో 34, విలియమ్సన్ 29, అబ్దుల్ సమద్ 23 చొప్పున పరుగులు చేశారు.
కాగా. ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 5000 వేల పరుగులు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వార్నర్ 135 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నాడు.