సంజయ్ మంజ్రేకర్‌కు షాకిచ్చిన బీసీసీఐ - కామెంటరీ ప్యానల్‌లో నో బెర్త్

శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:05 IST)
భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేరుకోలేని షాకిచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ కామెంటరీ ప్యానెల్‌ను నియమించింది. ఇందులో ఏడుగురు సభ్యులకు చోటు కల్పించింది. ఈ ఏడుగురు సభ్యుల్లో సంజయ్ మంజ్రేకర్‌కు చోటు కల్పించలేదు. 
 
అలాగే, ఈ ప్యానల్‌లో సునీల్ గవాస్కర్, మురళీ కార్తీక్, దీప్ దాస్ గుప్తా, శివరామకృష్ణన్, రోహన్ గవాస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రాలకు చోటు కల్పించారు. మురళీ కార్తీక్, దాస్ గుప్తాలు అబుదాబిలో... మిగిలిన వారు దుబాయ్, షార్జా వేదికల్లో కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు. అబుదాబి, దుబాయ్‌లలో 21 మ్యాచ్‌లు, షార్జాలో 14 మ్యాచ్‌లు జరగనున్నాయి. 
 
కరోనా భయం... అంపైర్ల కుంటిసాకులు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీని కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతోంది. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నీపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. ఒకవైపు ఆటగాళ్లు, మరోవైపు అంపైర్లు, ఇంకోవైపు సహాయక సిబ్బంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో ఈ టోర్నీ నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. 
 
నిజానికి ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. ప్రస్తుతం ఈ టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భాగంగా, ఈ నెల 19వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే, ఐపీఎల్-13వ సీజన్‌ను కరోనా పట్టిపీడిస్తోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడడంతో అంపైర్లు వణికిపోతున్నారు. అంపైరింగ్ విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి తప్పుకుంటున్నారు.  
 
అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాలంటూ ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లను బీసీసీఐ కోరగా కేవలం నలుగురు మాత్రమే ముందుకొచ్చారు. క్రిస్‌ గఫాని (న్యూజిలాండ్‌), రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌), మైఖేల్ గాఫ్‌ (ఇంగ్లండ్‌), నితిన్‌ మీనన్‌ (భారత్) తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. నిజానికి ఐపీఎల్‌కు కనీసం 15 మంది అంపైర్లు అవసరం. వీరిలో 12 మంది ఫీల్డ్, టీవీ అంపైర్లుగా విధులు నిర్వర్తిస్తారు. మిగతా వారు ఫోర్త్ అంపైర్లుగా ఉంటారు.
 
కాగా, పైన చెప్పిన నలుగురు మినహా మిగతావారు వ్యక్తిగత కారణాల సాకుతో దూరమవుతున్నారు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌లో భాగంగా ఉంటున్న కుమార ధర్మసేన కూడా ఈసారి దూరం కాబోతున్నట్టు సమాచారం. ఇందుకు అతడు చెప్పిన కారణం.. శ్రీలంకలో జరిగే క్రికెట్‌ టోర్నీలతో తాను బిజీగా ఉండడం. 
 
నిజానికి ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి బీసీసీఐ ప్రతిసారి ఆరుగురు అంపైర్లను తీసుకుంటోంది. ఈసారి మరింత ఎక్కువమందిని తీసుకోవాలని భావించింది. అయితే, రెండు నెలలపాటు పూర్తి నిర్బంధంలో విధులు నిర్వర్తించడం కష్టమన్న అభిప్రాయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వారి స్థానంలో భారత అంపైర్లను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు