ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తున్న క్లిష్టపరిస్థితుల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 టోర్నీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేసింది. ఈ టోర్నీ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్నారు.
అయితే, రిజర్వ్ బెంచ్ ఎంతో పటిష్టంగా ఉన్న ముంబై జట్టు ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్‌తో మలింగ స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనిపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, శ్రీలంకలోని తన కుటుంబంతోనే ఉండాలని మలింగ నిర్ణయించుకున్నాడని, అతడి అభిప్రాయాలకు విలువ ఇస్తామని తెలిపారు.
ముంబై ఇండియన్స్ ఓ జట్టు మాత్రమే కాదని, విలువలున్న ఓ కుటుంబం అని వివరించారు. మా ఇంటి సభ్యుడి వంటి మలింగకు ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తామన్నారు. మలింగ స్థానంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్‌ను తీసుకుంటున్నామని, ప్యాటిన్సన్ ముంబయి జట్టు అవసరాలకు తగినవాడని భావిస్తున్నామని వివరించారు.
అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా రెండు ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెల్సిందే. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కుటుంబ కారణాలతో స్వదేశానికి తిరిగిరాగా, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ కూడా ఈ టోర్నీకి దూరంగా ఉండనున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు సీఎస్కేకు దూరం కావడం ఆజట్టుకు పెద్ద ఎదురుదెబ్బే.