ఐపీఎల్ 2020 : ఓడిన రాయల్ ఛాలెంజర్స్ ... ప్లే ఆఫ్‌లో ముంబై ఇండియన్స్

గురువారం, 29 అక్టోబరు 2020 (08:48 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, బుధవారం రాత్రి జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ గెలుపుతో ముంబై జట్టు ప్లే ఆఫ్‌కు అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. బెంగుళూరు జట్టు నిర్ధశించిన 165 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై జట్టు మరో 5 బంతులు మిగిలివుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 11 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 90 పరుగులు దాటడంతో బెంగళూరు భారీ స్కోరు చేస్తుందని భావించారు. అయితే, కెప్టెన్ కోహ్లీ (9) అవుటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. వికెట్లను వెంటవెంటనే చేజార్చుకుంది. దీనికితోడు బుమ్రా విజృంభించి మూడు వికెట్లు తీయడంతో జట్టు స్కోరు నెమ్మదించింది.
 
ఓపెనర్ ఫిలిప్పీ 33 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ మరోసారి చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు. అతడి తర్వాత మరెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. డివిలియర్స్ (15) మరోమారు నిరాశపరచగా, దూబే (2), మోరిస్ (4), గురుకీరత్ సింగ్ (14), వాషింగ్టన్ సుందర్ (10) పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్... 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ముంబై గట్టెక్కింది. పరుగులు చేయడానికి మిగతా బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులు పడుతున్నా.. సూర్యకుమార్‌ అలవోకగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఐదో వికెట్‌కు హార్దిక్‌ పాండ్యాతో కలసి 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఓపెనర్లు డికాక్‌ (18), ఇషాన్‌ కిషన్‌ (25) పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. 
 
ఆరో ఓవర్‌లో డికాక్‌ను అవుట్‌ చేసిన సిరాజ్‌.. తొలి వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఊరించే బంతితో ఇషాన్‌ను చాహల్‌ బోల్తా కొట్టించాడు. అయితే, సూర్యకుమార్‌ ఎంట్రీతో సీన్‌ మారింది. చాహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 6,4తో గేర్‌ మార్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సిరాజ్‌ బౌలింగ్‌లో పడిక్కళ్‌ మంచి క్యాచ్‌ అందుకోవడంతో సౌరభ్‌ తివారి (5) వెనుదిరిగాడు. 
 
11 ఓవర్లు ముగిసే సరికి ముంబై 73/3తో నిలిచింది. స్టెయిన్‌ వేసిన 13వ ఓవర్‌లో యాదవ్‌ మూడు ఫోర్లు బాదాడు. అయితే, చాహల్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌తో క్రునాల్‌ వికెట్‌ పారేసుకోవడంతో.. నాలుగో వికెట్‌కు 35 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా (17) ధాటిగా ఆడాడు. చివరి 30 బంతుల్లో 48 రన్స్‌ అవసరమవగా, సిరాజ్‌ వేసిన 16వ ఓవర్‌లో సూర్యకుమార్‌ 3 ఫోర్లతో 13 రన్స్‌ రాబట్టడంతో మ్యాచ్‌ ముంబైవైపు మొగ్గింది. 
 
హార్దిక్‌ను మోరిస్‌ అవుట్‌ చేసినా, ఆఖరి ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌కు తరలించి సూర్యకుమార్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, గురువారం దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు