వెలుగులోకి పద్మనాభుని నిధులు: వినాశనం మొదలు..?!!

మంగళవారం, 26 జులై 2011 (18:28 IST)
WD
అనంత పద్మనాభుని సంపద ఎంతో భక్తులకు చాటిచెప్పాలని కోర్టుకెక్కిన సుందర రాజన్ హఠాత్తుగా మరణించడం తాజా మలుపు. నేలమాళిగల్లో ఇటీవల లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పురాతన సంపద వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. అసలు ఈ సంపద గురించి బయట ప్రపంచానికి తెలియడానికి ప్రధానకారణమైన, నేలమాళిగలు తెరవాలని న్యాయపోరాటం చేసిన వ్యక్తి సుందరరాజన్.

ఆయన వయోభారంతో మరణించారా...లేక ఏదైనా బలమైన కారణం ఉన్నదా అన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఏడుపదుల వయసులో కూడా సుందర రాజన్ నిన్నమొన్నటి వరకు హుషారుగానే తిరిగారు. ఆలయం పక్కనే వారి ఇల్లు. ఆయన గతంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భద్రతా విభాగంలో కీలక బాధ్యతలే చేపట్టారు. ఆ తరువాత న్యాయవాదవృత్తిలో స్థిరపడ్డారు. సుందరరాజన్ తండ్రి రాజవంశస్థుల దగ్గర న్యాయ సలహా దారునిగా పనిచేశారు.

బహుశా, అందుకనేనేమో, ఆలయంలోని నిధినిక్షేపాల గురించిన కీలక సమాచారంపై ఆయనకు అవగాహన ఏర్పడి ఉంటుంది. అంతేకాదు, రాజవంశస్థులు `అనంత' సంపదపై తమదే పూర్తి హక్కులన్నట్టుగా మాట్లాడటం కూడా ఆజన్మబ్రహ్మచారి అయిన సుందర రాజన్‌ను బాధించింది. ఒకప్పుడు ఇదే రాజవంశస్థులు(మార్తాండవర్మ) మొత్తం రాజ్యాన్నే అనంత పద్మనాభుని పాదాల చెంతన ఉంచారు. రాజు కూడా పద్మనాభదాసుడేనని ప్రకటించారు. అలాంటి రాజవంశస్థుల్లో క్రమేణా ఆలోచనల్లో మార్పు వచ్చిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.

స్వామివారికి వచ్చిన కానుకలను సైతం తమ సొంత సొమ్ముగా భావించే మనస్తత్వం మొగ్గతొడగడంతోనే సుందర రాజన్ ఈ సంపదను ప్రపంచానికి తెలియజెప్పాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఆయన కోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని నియమించి నేలమాళిగల్లోని గదులను తెరిపించే పనికి పూనుకుంది. ఇప్పటికే ఐదు గదులు తెరిచారు. లక్షన్నర కోట్ల రూపాయల సంపద బయటపడింది. మార్కెట్ విలువ ప్రకారం ఇది ఐదులక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు.

సుందర్ రాజన్‌ది సహజ మరణమేనా?
ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ రెండు రోజుల పాటు జ్వరంతో బాధపడి హఠాత్తుగా మృతి చెందారు. కానీ తన సంపదను బయటకు తీసి లెక్కించడంపై అనంత పద్మనాభుడు కన్నెర్ర చేశాడా? లేక నేలమాలిగల్లోని నిధులకు కాపలా ఉన్నట్లు చెబుతున్న నాగరాజస్వామి కాటేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సుందర రాజన్ కూడా పద్మనాభుని భక్తుడే. ఆయన తన జీవితాన్ని స్వామి సేవకే అంకితం చేశారు. అలాంటి వ్యక్తిపై పద్మనాభుడు కన్నెర్ర చేస్తాడా?

సుందరరాజన్ మృతిపై ప్రచారం ఉన్నట్టుగానే ఇప్పుడు తిరువనంతపురంలో మరో ప్రచారం ఊపెక్కింది. కోనేటి సంపదను తాకితే ప్రళయం తప్పదని వార్తలు వస్తున్నాయి. తిరువనంతపురం శ్రీ పద్మనాభ ఆలయం పుష్కరిణిలో వెలకట్టలేని సంపద ఉందని ప్రచారం జరుగుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో అంతులేని సంపద దాగి వుందని ప్రచారం జోరందుకుంది.

మైసూరు రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంతభాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారట. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగలో అపార సంపద బయటపడినందుకు సంతోషించాలో, లేక ఆరో గదికి నాగబంధం ఉన్నందుకు భయపడాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, అక్కడి స్థానికులు (తిరువనంతపురం వాసులు) చెబ్తున్న విషయాలు చాలా చిత్రంగా అనిపిస్తుండటమే...

FILE
కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరిస్తే, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

1. నాగబంధం అన్నది మొత్తం నిధినిక్షేపాలకు వర్తిస్తుంది.
2. కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు.
3. నేలమాళిగలోని ఐదు గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది.
4. సంపద వెలుగుచూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం సంభవించింది. మరొక సభ్యునికి కాలు విరిగింది.
5. ఐదు గదులను తెరిచిన తరువాత ఆరోగదిని కూడా తెరవాలనుకున్నారు. అయితే, ఆ గది తలుపులపై నాగపాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు.
6. ఈలోగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో మరో కమిటీ వేసి ఆస్తుల గుర్తింపు, భద్రపరిచే చర్యల పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు ఆరోగది విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు.
7. మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపుతున్నదని స్థానికులు చెబ్తున్నారు.
8. ఇందుకు పరాకాష్టగా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ కూడా కన్నుమూశారు.
9 ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉన్నదన్నది స్థానికుల్లో కొందరి ప్రగాఢ నమ్మకం.
10. ఆపార నిధినిక్షేపాలు ఐదు గదుల్లో ఉండగా, కేవలం ఆరో గదికే నాగబంధం వేశారని అనుకోవడం ఒట్టి భ్రమ అని తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పారు.
11. నాగబంధం ఒకసారి వేస్తే, అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది.
12. ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధినిక్షేపాలను కాపాడుతుంటాయి.
13. అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉన్నది. ఇది మొత్తం నిధినిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ, కేవలం ఆరోగదికి మాత్రమే పరిమితమైనది కాదు.
14. అందుకే, నిధినిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగడం మొదలైంది. అకాల మరణాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
15. మరి ఆరోగది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని కేరళలోని తాంత్రికుడ్ని ఫోన్ ద్వారా సంప్రదిస్తే దొరికిన సమాధానమిది.
16. ఆరోగది తలుపులు ఇప్పుడు తెరిచినా, తెరవకపోయినా జరగాల్సిన కీడు జరగడం మొదలైంది. కాకపోతే నాగబంధం ప్రభావం ఈ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చు.
17. ఆరోగది తలుపులు తెరిస్తే, అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకోవచ్చు. మరిన్నిదారుణాలు జరగవచ్చు.
18. తాంత్రిక శాస్త్ర పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా...అని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఇది...
19. ఆ పని ముందే చేయాల్సింది. అంటే, మొదటి గది తలుపులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులున్న వారిని పిలిపించి నాగబంధం నుంచి నిధినిక్షేపాలను విముక్తి చేసిన తరువాత గది తలుపులు తెరిస్తే బాగుండేది.

తుర్లపాటి నాగభూషణ రావు
సీనియర్ పాత్రికేయులు, ఫోన్: 98852 92208

వెబ్దునియా పై చదవండి