ప్రపంచంలోని తొలిసారి.. మన ఫోన్.. మన ఇష్టం : లావా నుంచి కస్టమైజ్ ఫోన్!

శుక్రవారం, 8 జనవరి 2021 (10:20 IST)
స్వదేశీ మొబైల్ తయారీ కంపెనీ లావా సరికొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ తరహా ఫోన్ తయారు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. మనం ఆర్డరిస్తే చాలు.. మనకు నచ్చినట్టుగా ఫోన్ తయారు చేసి ఇస్తుంది. మైజ్ పేరిట కస్టమైజ్‌ ఫోన్ తయారు చేసి ఇస్తుంది.
 
వాస్తవానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నో రకాలైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో మనకు అవసరమైన, అనుకూలమైన ఫీచర్లు ఉంటాయో లేదో తెలియదు.. ఒకరికి అద్భుతమైన కెమెరా ఉండాలి.. మరొకరికి మెమొరీ సదుపాయం ఎక్కువగా ఉండాలి. అయితే వీటన్నింటికి పరిష్కారం చూపు తూ దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్‌.. కస్టమైజ్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా 'మైజ్' పేరిట కస్టమైజ్‌ చేసుకునే అవకాశం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు.. కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి తమకు ఎలాంటి కెమెరా కావాలి, మెమొరీ సామర్థ్యం, రంగు వంటివి ఎంపిక చేసుకోవచ్చు. ప్రపంచంలో కస్టమైజ్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదొక్కటే. ఈ ఫోన్లు ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రెసిడెంట్‌ సునీల్‌ రైనా చెప్పారు.
 
కస్టమర్లు 66 రకాల కాంబినేషన్ల నుంచి కెమెరా, రాండమ్‌ యాక్సెస్‌ మెమరీ (ర్యామ్‌), రామ్‌ (రీడ్‌ ఓన్లీ మెమరీ), రంగు వంటివి ఎంపిక చేసుకుని తెలియచేయాల్సి ఉంటుందన్నారు. అలాగే తమ అవసరాలకు దీటుగా హ్యాండ్‌సెట్‌ను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కస్టమైజ్‌ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. కస్టమైజ్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో జడ్‌ 1 ప్రారంభ ధర రూ.5499. ఈ సిరీస్‌లోనే జడ్‌ 2, జడ్‌ 4, జడ్‌ 6 స్మార్ట్‌ఫోన్లు రూ.6,999-రూ.9,999 మధ్యలో అందుబాటులో ఉంటాయని ప్రెసిడెంట్ సునీల్ రైనా వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు