ఆన్‌లైన్‌లో జియో సిమ్‌ కొనేముందు....జాగ్రత్త సుమా!

శనివారం, 15 అక్టోబరు 2016 (16:41 IST)
యాపిల్ ఫోన్ల కోసం విదేశాల్లో క్యూలు కట్టడం మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు రిలయన్స్ స్టోర్ల వ‌ద్ద ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. జియో సిమ్ కోసం రియ‌ల‌న్స్ డిజిట‌ల్‌, మినీస్టోర్ల వ‌ద్ద భారీ క్యూలు క‌నిపిస్తున్నాయి. సిమ్ చేతికొస్తే జియో ప్రివ్యూ ఆఫర్‌తో 90 రోజులపాటు అపరిమిత డేటా, కాల్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. 4జీ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత సిమ్‌తోపాటు ప్రివ్యూ ఆఫర్‌ను వర్తింపజేస్తుండడంతో కస్టమర్లతో ఈ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. అంతేకాదు బ్లాక్ మార్కెట్లోనూ ఈ సిమ్‌ల‌ను అమ్ముతున్నారు. ప్రివ్యూ ఆఫర్ కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. 
 
అందుకే కొన్ని దుకాణాలు, కొందరు కస్టమర్లు వీటిని రూ.రెండు వేల వ‌ర‌కు అమ్ముతున్నార‌ని వార్తలొస్తున్నాయి. దేశవ్యాప్తంగా కస్టమర్లు సిమ్‌ల కోసం ఎగబడుతున్నారు, వినియోగదార్లు ఒకేసారి స్టోర్లను చుట్టుముట్టడంతో సిమ్‌ల కొరత కూడా తలెత్తింది. దీంతో అందరూ ఆన్‌లైన్‌సిమ్ లకే మొగ్గు చూపుతున్నారు. అయితే జియో సిమ్‌లను ఆన్‌లైన్‌లో కొనే వినియోగదారులు జాగ్రత్తపడక తప్పదు. రిలయన్స్‌ జియో సిమ్‌లను కొన్ని వెబ్‌సెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు చేయవలసిందేంటంటే...వాళ్లు ఏర్పరచిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌లో మన పేరు, పూర్తి వివరాలు ఐడీలను జతపరిస్తే చాలు. 
 
దరఖాస్తు చేసిన ఏడు నుంచి పదిరోజుల్లోపు కేవలం రూ.199ల డెలివరీ రుసుముతో జియోసిమ్‌లను ఇంటికి తెచ్చిస్తామని ఆ వెబ్‌సైట్లు ప్రకటిస్తున్నాయి. దీంతోపాటుగా రూ.1,999కే రిలయన్స్‌ జియో డోంగిల్‌, రూ.2,199కే రిలయన్స్‌ వైఫై డోంగిల్‌లను సైట్లు అందిస్తున్నాయి. అయితే ఇక్కడ వినియోగదారులు పాటించాల్సిన విషయం ఏంటంటే..అయితే ఇప్పటివరకూ ఆ సంస్థ ఎటువంటి ఆన్‌లైన్‌, హోం డెలివరీ సేవలను ప్రకటించలేదు. కొన్ని నకిలీ వెబ్‌సైట్లు వాట్సప్‌, ఈమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఈ అమ్మకాలు జరుపుతున్నాయి. 
 
సిమ్‌ డెలివరీ సమయంలో వారు సేకరిస్తున్న అడ్రస్‌, గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో వంటి పూర్తి వివరాలను సేకరిస్తున్న ఈ వెబ్‌సైట్లు మనల్ని ప్రమాదాలకు గురిచేస్తుంది. కాబట్టి ఆన్‌లైన్‌ వినియోగదారులు ఇది గమనించి అటువంటి మోసపూరితమైన వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి