ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 5జీ సాంకేతికతను అందిపుచ్చుకునే పనిలో ఉండగా.. చైనా అప్పుడే 6జీ పరిశోధనలకు రంగం సిద్ధం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వున్న 4జీతో పోలిస్తే 5జీలో కనీసం 20 రెట్లు వేగంగా డేటా లభిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీలకు 5జీ ఎంతో ఉపకరిస్తుంది.
ఈ నేపథ్యంలో 5జీ సేవలను ప్రారంభించిన చైనా మరో అడుగు ముందుకు వేసింది. చైనా 6జీపై కన్నేసింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు ప్రారంభిందని ఆ దేశ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవలే సమావేశమైంది. 6జీ అభివృద్ధి పరిశోధనకు రెండు గ్రూపులను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరుగుతున్నట్లు చైనా మీడియా తెలిపింది.