ఇకపై ప్రతి ఒక్కరూ ట్విట్టర్‌కు డబ్బులు చెల్లించాల్సిందే.. ఎలాన్ మస్క్

బుధవారం, 20 సెప్టెంబరు 2023 (15:25 IST)
ఇకపై ప్రతి ఒక్క ట్విట్టర్ యూజర్ ఇకపై ఎంతో కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఇప్పటికే ప్రీమియర్ యూజర్ల నుంచి ఆయన నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇకపై ట్విట్టర్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించేలా మార్పులు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. 
 
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చిస్తున్న సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. ఎక్స్‌ (ట్విట్టర్ ఖాతా)ను వాడే వారు ప్రతి నెలా 'స్వల్ప మొత్తం' చెల్లించాల్సి ఉంటుందని మస్క్ వెల్లడించారు. ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉందని ఆయన వివరించారు. బాట్స్‌ను తొలగించేందుకు ఇది ఓ చర్య అని వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఎక్స్ 550 మిలియన్ నెలవారీ యూజర్లు ఉండగా.. సగటున రోజుకు 100-200 మిలియన్ పోస్టులు పెడుతుంటారని చెప్పారు. ఇందులో బాట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. బాట్స్‌ను తొలగించాలంటే స్వల్ప మొత్తంలోనైనా ఫీజు వసూలు చేయడం అవసరమంటూ మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల బాట్స్‌కు అడ్డుకట్ట వేయడానికి వీలవుతుందన్నారు. ట్విటర్ కొనుగోలు సమయంలోనూ బాట్స్ గురించి మస్క్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు