కరోనా సంక్షోభంలో విలవిల్లాడిన బాధితులకు సానుభూతి ప్రకటించారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఈ కష్ట కాలంలో భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ ప్లాంట్లనిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టిపెట్టామని ట్వీట్ చేశారు.
అలాగే కరోనా విలయం సమయంలో ప్రభుత్వాలతో వ్యక్తులుగా, సమూహాలుగా ఇంతకుముందెన్నడూ లేని విధంగా దేశంలో అనేకంది స్పందించారనీ, ఈ క్రమంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషించిదనీ కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెట్ సంజయ్ గుప్తా తెలిపారు. కాగా ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలు, అత్యవసర సహాయక చర్య కోసం గూగుల్ ఏప్రిల్‌లో రూ.135 కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా అందించిన నిధులతో ముఖ్యంగా హెల్త్ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం వినియోగించనున్నట్టు గూగుల్ తెలిపింది.
గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సహాయాన్ని అందిస్తాయి. సంబంధిత టార్గెట్ ఏరియాలను గుర్తించి, వాటిని సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ఇతర అధికారులతో పని చేస్తుంది.