చండీఘర్‌ ఇంటర్ విద్యార్థికి జాబ్ ఇవ్వలేదు : గూగుల్

బుధవారం, 2 ఆగస్టు 2017 (15:10 IST)
చండీగఢ్‌కు చెందిన ఇంటర్ విద్యార్థికి నెలకు రూ.1.44 కోట్ల వేతనంతో గూగుల్‌లో కంపెనీలో ఉద్యోగం వచ్చినట్టు వార్తలో నిజం తేలింది. ఈ వార్తకు తమకు ఎలాంటి సంబంధం లేదనీ గూగుల్ ప్రతినిధులు స్పష్టంచేశారు. 
 
ఇంటర్ చదివే 16 యేళ్ల విద్యార్థి హర్షిత్ శర్మ గూగుల్ కంపెనీలో రూ.1.44 కోట్ల వార్షిక వేతనం పొందే ఉన్నత స్థాయి ఉద్యోగంలో చేరినట్టు ఓ వార్త ఒకటి వైరల్ కావడం, ఆ విద్యార్థి అరుదైన ఘనత సాధించాడంటూ నెటిజన్లు అభినందిస్తూ పోస్టులు చేశారు. 
 
అయితే ఈ విషయానికి సంబంధించి గూగుల్ కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాట అలా అభినందించిన వారిని అవాక్కయ్యేలా చేసింది. ఆ కుర్రాడి ఉద్యోగ నియామకానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతానికి హర్షిత్ శర్మ నియామకానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అతను చదువుతున్న స్కూల్‌లో యాజమాన్యం ప్రకటన చేసినందువల్లే ఇదంతా జరిగిందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. 
 
ఇదే విషయంపై కురుక్షేత్రంలో ఉంటున్న సదరు విద్యార్థి హర్షిత్‌ను సంప్రదించేందుకు మీడియా ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో అతని జాబ్ ప్రకటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి