ఇక వారంలో మూడు రోజుల సెలవులు.. ఎక్కడ.. ఎవరికి?

ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (13:52 IST)
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తమ సంస్థ ఉద్యోగులకు డిసెంబరు వరకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించింది. ఇపుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వారంలో మూడ్రోజులను సెలవులుగా ప్రకటించింది. 
 
కరోనా నేపథ్యంలో ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకూ శని, ఆదివారాలను మాత్రమే వారాంతపు సెలవులుగా తీసుకున్న గూగుల్ ఉద్యోగులకు.. తాజా ప్రకటనతో శుక్రవారం కూడా సెలవు తీసుకునే అవకాశం లభించింది.
 
కరోనా నేపథ్యంలో గూగుల్ ఉద్యోగులు దాదాపు ఆరు నెలల నుంచి 'వర్క్ ఫ్రమ్ హోం' విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే.. 'వర్క్ ఫ్రమ్ హోం' వల్ల పని గంటలు పెరిగాయని, వ్యక్తిగత సమయాన్ని కూడా విధుల కోసం కేటాయించాల్సి వస్తోందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం గూగుల్ దృష్టికి వెళ్లింది.
 
దీంతో 'వర్క్ ఫ్రం హోం' చేస్తున్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించే ఉద్దేశంతో సంస్థలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులకు శుక్రవారం రోజును కూడా వీక్ఆఫ్‌గా ప్రకటించింది. గూగుల్ నిర్ణయంతో ఇతర ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా తమకు కూడా రెండు రోజుల వారాంతపు సెలవులతో పాటు అదనంగా మరో రోజు వీక్‌ఆఫ్ తీసుకునే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు