జియోకు షాక్ : ఇంటెక్స్ టర్బో+ నుంచి 4జీ ఫోన్.. ధర..?

బుధవారం, 2 ఆగస్టు 2017 (13:08 IST)
అన్ని టెలికాం కంపెనీలకు షాకిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు ఇంటెక్స్ కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కంపెనీ తయారు చేసే మొబైల్స్ ఫోన్లలో నవరత్న సిరీస్ కింద అతి తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ దీపావళి నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 
 
నిజానికి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత టెలికాం రంగంలో 4జీ విప్లవం మొదలైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరూ ఈ తరహా ఫోన్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా, 4జీ ఫోన్లులేని 50 కోట్ల మంది మొబైల్ వినియోగదారులను తనవైపుకు తిప్పుకునేందుకు రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో ఉచితంగా ఫోన్ ఇవ్వనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఇది పెను సంచలనంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్, ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ తరహా ఫోన్‌ను తక్కువ ధరకు విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇంటెక్స్ కంపెనీ టర్బో ప్లస్ 4జీ పేరిట ఓ నూతన 4జీ వీవోఎల్‌టీఈ ఫోన్‌ను విడుదల చేసింది. రూ.1500 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు వచ్చే దీపావళి నుంచి అందుబాటులోకి రానుంది. 
 
ఇంటెక్స్ టర్బో ప్లస్ 4జీ ఫీచర్లను పరిశీలిస్తే... 2.4 ఇంచ్ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, కాయ్ (Kai) ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, టార్చి లైట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి