టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ఖజానాకు భారీగా బకాయిలు చెల్లించాల్సి వున్న టెలికాం సంస్థలు ఛార్జీలు పెంచనిదే మరోదారి లేదనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే గత డిసెంబరులో 42 శాతం వరకు డేటా ఛార్జీలు పెంచిన కంపెనీలు, మరింత పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ దఫా ఛార్జీల వడ్డ మరింత పెరిగే అవకాశం వున్నట్లు టెలికాం రంగ నిపుణులు చెప్తున్నారు.
గడిచిన 20 ఏళ్ల కాలానికి టెలికాం సంస్థలు రూ.47 లక్షల కోట్లను కేంద్రానికి బకాయిలుగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ టెల్ రూ. 35 వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 53 వేల కోట్లు కట్టాలి. ఈ భారాన్ని తట్టుకోవాలంటే ప్రస్తుతం సెల్ ఫోన్ ఛార్జీలను పెంచాల్సివుంది.
అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వస్తాయి. వచ్చే ఏడాది వ్యవధిలో వినియోగదారుడి నుంచి వచ్చే నెలసరి సగటును రెట్టింపు చేసుకోవాలన్న టార్గెట్‌తో టెల్కోలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జియో రంగ ప్రవేశానికి ముందు ఒక జీబీ డేటాకు రూ. 200కు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 2016లో జియో వచ్చిన తరువాత, డేటా ఖర్చు గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే.